సునంద పుష్కర్ మృతిపై అనుమానాలు

 

 

 

అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సునంద పుష్కర్ బౌతికకాయానికి వైద్యులు శవపరీక్ష పూర్తి చేశారు. ఆమెది అసాధారణ మృతిగా వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె మెడ, మణికట్టుపై గాయలు ఉన్నాయన్నారు. మరికొన్ని పరీక్షల అనంతరం నివేదికను మెజిస్ట్రేట్‌కు అందజేయనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. విషం తీసుకున్న ఆనవాళ్ళు లేవని స్పష్టం చేశారు. శవపరీక్ష అనంతరం ఎయిమ్స్ వైద్యులు ఆమె మృతదేహాన్ని శశిథరూర్ కి అప్పగించడంతో ఆయన నివాసానికి తీసుకెళ్ళారు.

 

ఇటీవలే తమ ఆస్పత్రిలో సునందా పుష్కర్ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని కేరళలోని తిరువనంతపురంలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. ఆమెకు ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు లేవని వారు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు సాధారణ మందులు ఇచ్చామని కార్డియాలజిస్ట్ డాక్టర్ జి విజయరాఘవన్ తెలిపారు. జనవరి 12న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సునందా పుష్కర్ 14న డిశ్చార్జ్ అయ్యారని, ఆమెతోపాటు భర్త శశిథరూర్ కూడా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో సునందా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ఆమె మృతి తమకు షాక్‌కు గురి చేసిందని వైద్యులు తెలిపారు. కాగా సునందా కుమారుడు శివ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు. థరూర్ కుమారులు ఇశాన్, కనిష్క్ ఢిల్లీకి వెళ్లనున్నారు.