సునంద పుష్కర్ మృతి...ప్రముఖుల దిగ్భ్రాంతి

 

 

 

సునంద పుష్కర్ మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన థరూర్‌కు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక.. సునంద ఆకస్మిక మృతితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పాక్ జర్నలిస్ట్, ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన మెహర్ తరార్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. తన బాధను మాటల్లో వర్ణించలేనన్నారు. సునంద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి కపిల్ సిబల్, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, శిల్పా శెట్టి.. తదితర ప్రముఖులు షాక్‌కు గురయ్యామంటూ ట్వీట్ చేశారు.

 

కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో హోటల్‌గదిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియగానే పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వారి ఫోన్ కాల్స్ వివరాలను సేకరించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.



కేంద్రమంత్రి శశిథరూర్-ఆయన భార్య సునంద పుష్కర్-పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్.. ఈ ముగ్గురి మధ్య ట్విటర్‌లో జరిగిన సంవాదం బుధ, గురువారాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తన భర్తకు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని, ఆమె పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అని.. తన భర్తను వేధిస్తోందని సునంద సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంబంధం కొనసాగుతోందని, వీరిద్దరూ చాలాకాలంగా ఒకరికొకరు బ్లాక్‌బెర్రీ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుకొంటున్నారని వివరించారు. త్వరలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానన్నారు. అలాగే తరార్ తన భర్తను వేధిస్తోందని, తాను అనారోగ్యంతో భర్తకు దూరంగా ఉన్న సమయంలో తమ వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటోందని సునంద మండిపడ్డారు.