సమ్మర్‌ హాలీడేస్‌..డేంజర్ జోన్‌లో పిల్లలు

వేసవి సెలవులు వచ్చేశాయ్‌. పొద్దున్నే లేవనవసరం లేదు. పిల్లలను రెడీ చేయనవసరం లేదు. వాళ్లే ఏదోఒక టైమ్‌లో నిద్రలేచి, ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో తమకు నచ్చిన గేమ్స్‌ ఆటలు ఆడుకుని ఇంటికి తిరిగొస్తారులేనని రిలాక్స్‌ అయ్యారా? అయితే మీ పిల్లలు డేంజర్‌లో ఉన్నట్లే. సమ్మర్ హాలీడేస్‌ని పిల్లలు సరదాగా ఎంజాయ్‌ చేస్తారని వాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నారా? అయితే మీ పిల్లలపై మీరు ఆశలు వదులుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లిన మీ పిల్లలు తిరిగొస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే సమ్మర్‌లో సరదాగా ఆడుతోన్న ఆటలు... కిల్లర్‌ గేమ్స్‌గా మారుతున్నాయి. తోటి ఫ్రెండ్సే ప్రాణాలు తీస్తున్నారు. తెలిసినవాళ్లే చంపేస్తున్నారు. చిన్నపాటి గొడవకే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. 

 

సరదాగా మొదలవుతున్న గేమ్స్ కాస్తా.... చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌ ప్రాణాలు తీస్తోంది. బంతి తగిలో లేక ఆటలో చెలరేగిన చిన్నపాటి గొడవో చివరికి ప్రాణాలు తీసేంతవరకూ వెళ్తోంది. విజయవాడలో అదే జరిగింది. క్రికెట్... ఓ కుటుంబంలో నిషాదాన్ని నింపింది. బెజవాడ పీ అండ్ టీ కాలనీలో జరిగిన గొడవ ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. క్రికెట్ బంతి తగిలిందని యువకుడ్ని కత్తితో పొడిచి చంపేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన నగర ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. కొంతమంది యువకులతో కలిసి కిరణ్‌ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న ఓ మహిళకు కిరణ్ కొట్టిన బంతి తగిలింది. ఇదే అతని ప్రాణాలను తీసింది. 

 

చిన్నపాటి గొడవకే ప్రాణాలు తీసేయడంతో... తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. సమ్మర్‌ హాలీడేస్‌లో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్తే, ఏం గొడవలు ఇంటిమీదకొస్తాయోనని భయపడుతున్నారు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సమ్మర్‌ హాలీడేసే కదా అని, వాళ్ల ఇష్టానికి వదిలేస్తే, ఆ తర్వాత ఏదైనా జరగకూడనిది జరిగితే, నష్టపోయేది తల్లిదండ్రులే. అందుకే బీ కేర్‌ఫుల్‌ పేరెంట్స్‌... టేక్‌ కేర్‌ యువర్ చిల్డ్రన్.