TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రా తీరంలోనూ భూప్రకంపనలు

Published on: Wed Apr 11, 2012 4:22PM

హైదరాబాద్:  సుమత్ర దీవిలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతో తమిళనాడు, ఆంధ్ర, అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖపట్నం నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల మీదుగా తిరుపతి వరకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు నుంచి మూడు సెకన్ల మేర భూమి ప్రకంపించినట్లు తెలుస్తోంది. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి మళ్లీ వస్తాయనే భయంతో రోడ్ల మీదనే ఉన్నారు.

విశాఖపట్నం, భిమిలీ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, సీతమ్మధార, ఎన్ఎడి జంక్షన్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురం, కస్తూరిబాయిపేట వంటి ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది.

ఇండోనేషియాలో వచ్చిన భూకంపం వల్ల సునామీ వస్తుందనే భయాలకు ప్రజలు గురవుతున్నారు. ఇండోనేషియాలోని భూకంపం రెక్టర్ స్కేలుపై 8.9గా నమోదైనట్లు తెలుస్తోంది. మళ్లీ రాష్ట్రంలో భూకంపం వచ్చే అవకాశాలు మాత్రం లేదని అంటున్నారు. భారతదేశంలోని తూర్పు ప్రాంతాలపై కూడా ఇండోనేషియా భూకంపం ప్రభావం పడింది. దీంతో 28 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారతదేశంలోని గౌహతి, చెన్నై, కోల్‌కోత్తా, ముంబై, ఊటీ తదితర ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావంతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.