రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ..
Published on: Tue Jul 24, 2018 4:06PM
నిన్న రాజ్య సభ లో టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాసంపై స్వలాపకాలిక చర్చకు నోటీసులు ఇవ్వగా చైర్ పర్సన్ వెంకయ్య నాయుడు ఈ రోజు చర్చ జరుపుతామని వెల్లడించారు.అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ అంశంపై చర్చకు అనుమతించారు. చర్చకు మొత్తం 2.30 గంటల సమయాన్ని కేటాయించినట్లు చెప్పారు. చర్చను మొదటగా తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించారు.

ఈ చర్చలో తెదేపా తరఫున గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ తరఫున కేవీపీ, భాజపా తరఫున జీవీఎల్ నరసింహారావు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి చర్చలో పాలొననున్నారు. చర్చ సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నేతలను తెదేపా ఎంపీలు కోరారు.చర్చ ప్రారంభించిన సుజనా విభజన హామీలను కేంద్రం విస్మరించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహకార స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో జరుగుతున్న మూక దాడుల తరహాలోనే ఏపీపై కేంద్రం వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేంద్రం తన అధికారాలతో రాష్ట్రానికి అన్ని వనరులను కట్టడి చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని,గత ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయాలను ఇప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదని వాపోయారు.ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు, తిరుపతి సభలో మోదీ చెప్పలేదా? అని సుజనా నిలదీశారు.


