విజయసాయి అబద్దం చెప్పారా? మోడీ-షాకి ఫిర్యాదు చేస్తానని సుజనా ఎందుకన్నారు?

 

వైసీపీ పార్లమెంటరీ నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి అబద్దాలు చెబుతున్నారా? పోలవరం రీటెండరింగ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ... ఇలాంటి కీలక నిర్ణయాల వెనుక నిజంగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయా? లేక విపక్షాల గొంతు మూయించడానికి దక్కీ ఇచ్చారా? నిజంగానే జగన్ తన నిర్ణయాలను ముందుగా మోడీ, అమిత్ షాకి చెబుతున్నారా? కేంద్రం ఆశీస్సులతోనే దూకుడుగా వెళ్తున్నారా? అసలు విజయసాయి మాటల్లో నిజమెంత?

మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జగన్... రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దులాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన రోజే... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీకి కేంద్రం ఆక్షింతలు వేసింది. అవినీతిపై ఎలాంటి ఆధారాల్లేకుండా పీపీఏలను రద్దు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. మరి విజయసాయి చెప్పినట్లు.. పీపీఏల సమీక్ష/రద్దుకు మోడీ, అమిత్ షా ఆశీస్సులుంటే, కేంద్ర విద్యుత్ శాఖ... జగన్ సర్కారును ఎందుకు హెచ్చరిస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ప్రశ్నిస్తున్నారు. 

విజయసాయిరెడ్డి అబద్దాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యల్లో కొంచెం కూడా నిజం లేదని సుజనాచౌదరి అంటున్నారు. నిజంగానే మోడీ-షా ఆశీస్సులుంటే, పోలవరం రీటెండరింగ్, పీపీఎల రద్దు వద్దని కేంద్రం ఎందుకు చెబుతుందని నిలదీశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని, అప్పుడే నిజమేంటో బయటపడుతుందని సుజనా తెలిపారు.