సుజనాకి కేంద్ర మంత్రి పదవి....టెన్షన్ లో వైసీపీ 

 

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కూడా తన ఉనికిని కోల్పోయింది. అయితే నిన్నమొన్నటి దాకా మళ్ళీ టీడీపీ పునర్వైభవంతో ఉంటుందని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని ధీమాగా ఉండేవారు తెలుగు తమ్ముళ్ళు. కానీ ఒకే దెబ్బకి నలుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబు ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న మోడీ నేతృత్వంలోని బీజేపీలో చేరి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా బాబు స్కెచ్ అనే వారూ లేకపోలేదు. అయితే అది బాబు స్కెచ్చా లేక ఆ ఎంపీల స్వయం నిర్ణయమా అనేది పక్కన పెడితే ఇప్పుడు చేరిన ఆ నలుగురిలో ఒకరయిన సుజనా చౌదరి మరో మారు కేంద్ర మంత్రి కాబోతున్నట్టు ప్రచారం మొదలయ్యింది.

నిజానికి ఇదేం అసాధ్యం అనే విషయం కాదు, ఎందుకంటే ఏపీ నుండి ప్రస్తుతానికి కేంద్ర మంత్రి ఎవరూ లేరు. మామూలుగా కేంద్రమంత్రివర్గంలో ప్రతీ రాష్ట్రానికి కనీసం ఒక మంత్రి లేదా ఒక సహాయ మంత్రి పదవి ఉండేలా చూసుకుంటారు. కానీ ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో లోక్ సభ కానీ రాజ్యసభ కానీ సభ్యులు ఎవరూ లేరు. కేరళ నుంచి మాత్రం ఓ బీజేపీ సీనియర్ నేతకు కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుండి కిషన్ రెడ్డికి చాన్స్ వచ్చినా ఏపీలో ఎవరూ లేరు కాబట్టి ఏపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. అయితే తాజాగా టీడీపీ నుండి వచ్చిన నలుగురు రాజ్యసభ సభ్యులతో ఆ ఇబ్బంది తీరిపోయింది. దీంతో వీరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం మొదలయింది. అందులో గతంలో సుజనా మోడీ కేబినెట్‌లోనే మంత్రిగా పనిచేయడంతో ఆయనకు మళ్ళీ పదవి ఇస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన మోడీ కేబినేట్ లో ఉండగానే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే అప్పటికి టీడీపీ మీద ఉన్న నమ్మకంతో ఎలాంటి జంపింగ్ లు చేయకపోయినా ఇప్పుడు అయన మరో ముగ్గురిని పట్టుకుని రావడంతో ఇక ఏపీ నుంచి సుజనానే కేంద్రమంత్రి కావడం ఖాయమ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం.  

అయితే ఆయన కేంద్ర మంత్రి అయితే టీడీపీకి లాభం లేకపోగా పెద్దగా నష్టం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ చంద్రబాబు శిష్యుడే కాబట్టి. కానీ ఆయన కేంద్ర మంత్రి అయితే కనుక పెద్ద దెబ్బ పడేది వైసీపీకే. ఎందుకంటే వైసీపీ ప్రస్తుతం టీడీపీ మీద పగతీర్చుకునే పనిలో ఉంది. మరో పక్క బీజేపీ ఏపీలో బలపడే పనిలో ఉంది. ముందుగా అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డ బీజేపీ నెమ్మదిగా టీడీపీ మీద ఫోకస్ తీసి వైసీపీ మీద పెట్టవచ్చు. జగన్ ఎటూ కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉంటారు. ఇప్పటికే వైసీపీ మా ప్రధాన ప్రత్యర్ధి అని చెబుతున్న బీజేపీ సుజనాలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి, ఏపీ అధ్యక్ష్య బాద్యతలు కూడా ఆయనకే అప్పచెబితే వైసీపీ మనుగడకే ఇబ్బంది రావచ్చు. అందుకే వైసీపీలో కొత్త టెన్షన్ మొదలయ్యిందని, టీడీపీ-బీజేపీ కుమ్మక్కు అనే ప్రచారాన్ని ఇప్పటి నుండే మొదలు పెట్టాలని వారు భావిస్తున్నారు. చూడాలి ముందు ముందు ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరగనుందో ?