రోడ్డున పడనున్న 20వేల మంది గ్రామసేవకులు
Published on: Fri Mar 2, 2012 3:05PM
జీవో 1745 పేరిట వేటుకు రంగం సిద్దం
తెలుగువన్.కామ్ ప్రత్యేక కధనం
హైదరాబాద్: గ్రామాల్లో జనన మరణాల వివరాలు సేకరించడం, అనాధలు మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడం, హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు సంభవించినప్పుడు మృతదేహాల వద్ద కాపలా కాయడం, వాటిని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలలకు తరలించడం.....వంటి పనులన్నీ నిర్వహిస్తూ గ్రామ సీమలకు సేవలందించడంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులపై వేటు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. జీవో నెంబర్ 1745 పేరుతో 65 ఏళ్లు దాటినవారిని ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తొలగించేందుకు రంగం సిద్దమైంది. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 20వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వీధినపడనున్నారు. గ్రామ సేవకుల్లో 90శాతం మంది బలహీన వర్గానికి చెందినవారే ఉన్నారు. గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో అక్కడకు చేరుకుని సేవలందించాలి. గ్రామంలో ఏ సమస్య వచ్చినా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరొచ్చినా పగలూ, రాత్రి తేడా లేకుండా అందుబాటులో ఉండాలి. ఒకవేళ వారికి చేసే సపర్యల్లో ఏ చిన్నలోపం జరిగినా అధికారులు పెట్టే చీవాట్లు భరించాలి. అంతేకాక తహసిల్దార్, ఆర్డీఓ, డిఆర్ఓ లు వరి సొంతపనులను కూడా వీరితో చేయించుకుంటారు. ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుని ప్రభుత్వం చెప్పిన ప్రతీ పనిని చేస్తున్న వీరిని జీవోనెంబర్ 1745 పేరిట తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.


