TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పీక‌ర్ ఫార్మాట్‌లో సుచ‌రిత రాజీనామా.. జ‌గ‌న‌న్న‌కు ఝ‌ల‌క్‌..

Published on: Sun Apr 10, 2022 10:22PM

శుక్ర‌వారం వ‌ర‌కూ ఆమె ఏపీ హోంశాఖ మంత్రి. ఫుల్ ప‌వ‌ర్ ఫుల్ పోస్ట్‌. వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌ల మ‌ధ్య ఆమె మూడేళ్లుగా పోలీస్ సూప‌ర్ బాస్‌గా ఉన్నారు. జ‌గ‌న‌న్న ఆదేశాల‌తో ఒక్క సంత‌కంతో మాజీ అయిపోయారు. క‌ట్ చేస్తే.. ఒక్క‌రోజులోనే ఆమె త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న‌న్న దెబ్బ‌కు దిమ్మ‌తిరిగిన సుచ‌రిత‌.. రాజీనామాతో జ‌గ‌న్‌రెడ్డికి అంతే మైండ్ బ్లాంక్ చేశారు. 

గ‌త కేబినెట్‌లో ఎస్సీ క‌మ్యూనిటీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. రాజీనామాల త‌ర్వాత, పున‌ర్విభ‌జ‌న‌లో ఆ ఐదుగురిలో న‌లుగురికి మ‌రోసారి ఛాన్స్ ద‌క్కింది. ఒక్క మేక‌తోటి సుచ‌రిత ప‌ద‌వి మాత్ర‌మే ఊడింది. దీన్ని తీవ్ర అవ‌మాన భారంగా భావిస్తున్నారు ఆమె. కేబినెట్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే.. ఆమె మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. అల‌క పాన్పు ఎక్కేశారు. సుచ‌రిత అనుచ‌రులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోయారు. దళిత సంఘాల నాయకులు, అభిమానులు భారీగా సుచరిత నివాసానికి చేరుకున్నారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి ముందు ఆందోళన చేశారు. 

విష‌యం తెలిసి సుచ‌రిత‌ను బుజ్జ‌గించ‌డానికి ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను రాయ‌బారిగా పంపించింది పార్టీ అధిష్టానం. మోపిదేవి సుచ‌రిత ఇంటికి వెళితే ఆయ‌న కారును అడ్డుకున్నారు అభిమానులు. ఓ అభిమాని పెట్రోల్ పోసుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

ఆ త‌ర్వాత సుచ‌రిత‌తో చ‌ర్చించి ఆమెను శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు మోపిదేవి. అయితే, మోపిదేవి ముందు ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడేళ్లుగా అంత క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే, ద‌ళిత ఎమ్మెల్యేను అయిన త‌న‌నే ప‌క్క‌న పెడ‌తారా? అంటూ నిల‌దీశారు. మూడు రోజులుగా స‌జ్జ‌ల‌ను క‌లిసే ప్ర‌య‌త్నించినా ఆయ‌న అవ‌కాశం ఇవ్వ‌లేదంటూ మండిప‌డ్డారు. ఇంత అవ‌మానం జ‌రిగాక త‌న‌కిక ఈ ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా అవ‌స‌రం లేదంటూ.. అక్క‌డిక‌క్క‌డే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎంపీ మోపిదేవి చేతిలో పెట్టారు మేక‌తోటి సుచ‌రిత‌. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసినా.. వైసీపీలోనే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు సుచ‌రిత‌.