TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజీనామా కాదట‌, థ్యాంక్స్ లెట‌ర్ అట‌.. స్టోరీ మార్చేసిన‌ సుచ‌రిత!

Published on: Wed Apr 13, 2022 5:50PM

మాజీ హోంమంత్రి సుచ‌రిత‌.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసొచ్చాక మీడియా ముందు స్టోరీ మార్చేశారు. మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అల‌క‌బూని.. ఆగ్ర‌హంతో ర‌గిలిపోయి.. ఇంటికొచ్చిన రాయ‌బారి ఎంపీ మోపిదేవికి రాజీనామా లేఖ ఇచ్చి పంపేసిన సుచ‌రిత‌.. ఇప్పుడు చ‌ల్లబ‌డ్డాక‌.. అది రాజీనామా లేఖ కాద‌ని.. థ్యాంక్స్ గివింగ్ లెట‌ర్ అంటూ చెప్పడం కామెడీ కాక మ‌రేంట‌ని అంటున్నారు. అమ్మ రాజీనామా చేసిందంటూ.. సుచ‌రిత కూతురు మైకులు ముందు అంత క్లియ‌ర్‌గా, కాన్ఫిడెంట్‌గా చెబితే.. లేదు లేదు, అదంతా తూచ్‌.. మా కూతురు పొర‌బాటు ప‌డింది.. త‌ప్పుగా చెప్పింది.. అది జ‌స్ట్ థ్యాంక్స్ లెటర్ అంటూ సుచ‌రిత ఇప్పుడు త‌మాషా త‌మాషాగా మాట్లాడారు. ఆమె అప్పుడు ఏం చేశారో.. జ‌గ‌న్‌ను క‌లిశాక ఇప్పుడు ఇలా ఎందుకు అన్నారో.. జ‌నానికి బాగా తెలుసు. పాపం.. సుచ‌రిత‌నే ప్ర‌జ‌లు వెర్రివెంగళప్పలు అనుకుంటున్న‌ట్టున్నారు.

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ హోంమంత్రి సుచ‌రిత‌ను సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌కు పిలిపించారు. లోప‌ల జ‌గ‌న‌న్న‌ గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ని అంటున్నారు. రాజీనామాపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సీనియర్‌ నేతలు మాట్లాడుతున్నప్పటికీ రాజీనామా చేసి ఇబ్బందికర పరిస్థితులు కల్పించారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాంటి దుందుడుకు చ‌ర్య‌లు పార్టీతో పాటు సుచ‌రిత రాజ‌కీయ భ‌విష్య‌త్తుకూ న‌ష్టం చేకూరుస్తాయంటూ గ‌ట్టిగానే హెచ్చ‌రించార‌ట సీఎం జ‌గ‌న్‌. 

సీఎం జ‌గ‌న్‌తో భేటీకి ముందే మాజీ మంత్రికి త‌త్వం బోధ‌ప‌డింది. మూడు రోజులుగా సుచ‌రిత‌ను ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న‌పెట్టేశారు జ‌గ‌న్‌. అదేంటి.. అంద‌రినీ బ‌తిమిలాడుతుంటే.. త‌న‌తో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం లేదేంటి? అంటూ సుచ‌రిత డిఫెన్స్‌లో ప‌డ్డార‌ని అంటున్నారు. జ‌గ‌న్‌ను క‌లిశాక‌.. ఆయ‌న ముందు త‌న ఆవేద‌న వెల్ల‌గ‌క్కార‌ని తెలుస్తోంది. మంత్రి వర్గం మొత్తాన్ని మార్చేస్తానని చెప్పి.. 11 మందిని తిరిగి కొనసాగించి తనను పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురయ్యానని సీఎంతో చెప్పినట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను కొనసాగించి తనను మాత్రమే తొలగించడం బాధ కలిగించిందన్నారు. మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాలను సుచ‌రిత‌కు.. సీఎం జ‌గ‌న్‌ వివరించినట్టు తెలిసింది. జిల్లా అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి కేబినెట్‌ ర్యాంకుతో సమానంగా ఉండే హోదా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. సుచ‌రిత‌ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. అలా బుజ్జ‌గిస్తూనే.. రాజీనామాపై సీరియ‌స్‌గా మంద‌లించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో గొంతులోనే బాధనంతా దిగ‌మింగుకొని.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియా ముందు గొంతు మార్చి.. స్టోరీ మార్చి.. చెప్పార‌ని చెబుతున్నారు.  

"జడ్పీటీసీ నుంచి హోం మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే అది సీఎం జగన్‌ కల్పించిన అవకాశమే. అనారోగ్యం కారణంగా నెల రోజులుగా బయటకు రాలేకపోయాను. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో కేబినెట్‌లో కొనసాగలేనేమోనని థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రకరకాలుగా వార్తలొచ్చాయి. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమోషన్‌కు గురయ్యా.. దయచేసి ఇంతటితో ఆపేయాలని కోరుతున్నా. రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను వైసీపీలోనే కొనసాగుతా. ఎప్పటికీ సీఎం జగన్‌ విధేయురాలిగానే ఉంటా" అని సుచరిత అన్నారు.