జల్లికట్టు ఉద్యమం వెనుక ఐఎస్ఐ...

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ముక్కుసూటిగా... కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు ఆందోళనలపై కూడా స్పందించారు. జల్లికట్టు నిరసనపై స్వామి మాట్లాడుతూ... జల్లికట్టు ఉద్యమం తొలుత ప్రశాంతంగా సాగిందని..మొదట ఆ ఉద్యమాన్ని నడిపిన వారు ఇప్పుడు లేరని ఆయన అన్నారు. ఇప్పుడక్కడ సంఘ విద్రోహశక్తులు ఉన్నాయని... ఐఎస్ఐ ప్రవేశించిన తరువాతే ఉద్యమం హింసాత్మకంగా మారిందని చెప్పారు. అంతేకాదు అసలు జల్లికట్టును నిషేదించింది కాంగ్రెస్ అని..తాము జల్లికట్టు కోసం ముందు నుండి పోరాడుతున్నామని.. అయినా జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని ఉద్యమకారులంటున్నారని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

 

కాగా జల్లికట్టు కు ఆర్డినెన్స్ సరిపోదు శాశ్వత పరిష్కారం కావాలంటూ చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నసంగతి తెలిసిందే. మొదట ప్రశాంతంగా జరిగిన ఈ నిరసన.. కాస్త హింసాత్మకంగా మారింది. పోలీసులు విద్యార్ధులపై లాఠీ థార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో.. విద్యార్ధులు పోలీసు స్టేషన్ కు నిప్పంటించి.. వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు విద్యార్ధులకు సినీ ప్రముఖుల దగ్గర నుండి పలు రాజకీయ పార్టీల మద్దతు లభించింది