బీజేపీ ఇప్పుడు కళ్లు తెరిచిందా..!

 

చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలానే ఉంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విచ్చలవిడిగా.. అందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నంతకాలం సైలెంట్ గా ఉండి..ఇప్పుడు మాత్రం ఆయన వైఖరిపై మండిపడుతోంది. అంతేకాదు ఇన్ని రోజులు ఏం మాట్లడని ప్రధాని మోడీ.. స్వామి వ్యాఖ్యలపై స్పందించి చురకలు అంటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థ కంటే తాము ఎప్పుడు అధికులం కాదని.. అలా అలోచించకూడదని.. అది తప్పని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన ప్రసంగించాల్సిన రెండు సభలను రద్దు చేసింది బీజేపీ. ముంబైలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని, చెన్నైలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన మరో ప్రోగ్రామ్ నూ రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండింటిలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాల్సి వుండగా, ఆయనేం వ్యాఖ్యలు చేస్తారోనన్న భయంతోనే వీటిని రద్దు చేసినట్టు సమాచారం.

 

కాగా ఇటీవల కాలంలో సుబ్రహ్మణ్యస్వామి బాగా రెచ్చిపోయిన సంగతి విదితమే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు పెట్టి ఆఖరికి అరుణ్ జైట్లీని కూడా వదలకుండా విమర్శించారు. దీంతో పార్టీ నేతలు ఆయనపై అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా సభలు కూడా రద్దు చేసింది. మరి ఈ జాగ్రత్తలేవో ముందే తీసుకుంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. మరి స్వామి గారు ఇప్పటికైనా తన రూట్ మారుస్తారా.. లేక ఎప్పటిలాగే నాదారి రహదారి అంటారా చూడాలి.