స్వామి ఇప్పటికైనా మారతాడా..?


బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నోటి గురించి తెలిసిందే. ఈమధ్య ఆయన నోటికి మరీ పని ఎక్కువ చెప్పేసి.. ఎవరి మీద పడితే వారిమీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలను విమర్సించడం నుండి మొదలు పెట్టిన ఆయన.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసే వరకూ వెళ్లారు. అయితే స్వామి ఇంతలా రెచ్చిపోతున్నా.. ప్రధాని మోడీ ఎందుకు ఆపే ప్రయత్నం చేయడం లేదు.. ఆయన నోటికి ఎందుకు బ్రేక్ వేయడం లేదు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు మోడీ స్వామి ఆరోపణలపై స్పందించి స్వామికి షాకిచ్చారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగాల్సిన అవసరముంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు' అని మోదీ తేల్చి చెప్పారు. అంతేకాదు రాజన్ గురించి మాట్లాడుతూ..  రాజన్ దేశభక్తిని ఏమాత్రం శంకించలేమని, తామందరికీ తీసిపోని స్థాయిలో ఆయనలో దేశభక్తి ఉందని అన్నారు.

 

కాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై స్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత వీదేశీ యాత్రలు చేసే మంత్రులు డ్రెస్సింగ్ పైనా కామెంట్లు చేస్తూ వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలోనే కాకుండా తిరుమల విషయంలో ఏపీ టీడీపీ పైనా కూడా ఆయన విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడైనా మోడీ వ్యాఖ్యలతో ఆయన తన నోటిని అదుపులో పెట్టుకుంటారో లేదో చూడాలి.