TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సస్పెన్షన్

Published on: Wed May 13, 2026 6:22PM

 

ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న 2018 బ్యాచ్‌కు చెందిన  సురేష్‌కుమార్‌పై మహిళా కానిస్టేబుల్‌ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో సురేష్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళా కానిస్టేబుల్‌ అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకుంది. అయితే కొంతకాలం తర్వాత పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా, సురేష్‌కుమార్‌ వివిధ కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో మహిళా కానిస్టేబుల్‌ అతనిని నిలదీయగా, పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని సురేష్‌కుమార్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌కుమార్‌ను విచారణకు హాజరుకావాలని ప్రయత్నించినప్పటికీ, అతను ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అందుబాటులో లేకపోయినట్లు తెలిసింది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం సురేష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన పోలీస్‌ శాఖలో సంచలనంగా మారగా, ప్రేమ పేరుతో మోసం చేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.