బోస్... హిస్టరీకి, మిస్టరీకి కేరాఫ్!

జనవరి 23... నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి! మరి వర్ధంతి ఎప్పుడు? ఏమో తెలియదు! ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మరే నేతకి వుండదనుకుంటా! బోస్ బతికుండగా ఎంత ప్రత్యేకంగా జీవించాడో... మరణంలోనూ అంతే విశిష్టంగా కొనసాగుతున్నాడు. అసలు ఆయన ఈ భూమ్మీద భౌతికంగా లేడంటే ఇప్పటికీ నమ్మేవారు లేరు! కాని, ఆయన 120వ జయంతి అయిన జనవరి 23, 2017న ఆయన మన మధ్య లేరని మనం అంగీకరించక తప్పుదు. నూటా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి నేతాజీ తమ అవతారం చాలించే వుంటారు. కాని, ఈ విషయం ఖచ్చితంగా మాత్రం చెప్పలేం...

 


జనవరి 23, 1897న ఒడిషాలోని కటక్ లో పుట్టిన సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా సాగుతోన్న భారత స్వాతంత్ర్య సంగ్రామ హోమంలో హవిస్సులా పడ్డాడు! దాన్ని భగ్గున మండిచాడు! గాంధీ నేతృత్వంలో ఒకవైపు అహింసాయుత ఉద్యమం సాగుతోంటే తెల్లోడికి అసలు వేడి తగిలేలా సైనిక పంథా అనుసరించాడు బోస్. 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీభాయి, నానా సాహేబ్, తాంత్యా తోపే లాంటి వారి వారసత్వాన్ని ఆయన గర్వంగా అందుకున్నాడు. కురుక్షేత్రంలో గీతా బోధ చేసిన శ్రీకృష్ణుని యుద్ధోపదేశాన్ని ధైర్యంగా పాటించాడు. అంతిమ గెలుపు బోస్ కు దక్కినా దక్కకున్నా ఆయన చేసిన ప్రయత్నమే గొప్ప విజయం. ఎందుకంటే, ఆయన ప్రపంచాన్ని తన పిడికిట్లో బంధించిన సామ్రాజ్యవాద గ్రేట్ బ్రిటన్ని స్వదేశంలో ఎదుర్కోలేదు. జర్మనీ, జపాన్ లాంటి సుదూర దేశాల్లో ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రపంచ నేతలతో భారత్ తరుఫున మాట్లాడాడు! అంటే, నిజంగా చెప్పుకుంటే స్వతంత్రానికి ముందే ఇండియాకు ఆయన ప్రతినిధి అయ్యారు. బెర్లిన్ నుంచి సింగపూర్ దాకా మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. అండమాన్ దీవుల్లో ఏర్పాటు చేసిన తన ప్రభుత్వం సాక్షిగా ఇప్పటికీ మార్మోగే జై హింద్ నినాదం ఇచ్చాడు!

 


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాహసోపేతంగా బ్రిటీష్ కు వ్యతిరేక వర్గంతో చేతులు కలిపిన బోస్ వ్యూహం పలించి వుంటే ఇవాళ్ల భారత్ ముఖ చిత్రమే వేరుగా వుండేది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. హిట్లర్ అరాచక నిర్ణయాల వల్ల, జపాన్ దుందుడుకు వ్యవహారం వల్లా అమెరికా, రష్యాల ప్రభావంతో అంతా తలకిందులైంది. అప్పుడే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ విధి రాత కూడా వక్రీకరించింది. 

 


చంద్రబోస్ మనకు స్వాతంత్ర్యం తేలేకపోయినా ఆయన మీద భారతీయుల్లో వున్న గౌరవం, అభిమానం, భక్తి మాత్రం చెక్కుచెదరలేదు. అందుకు, ఆయన చుట్టూ అల్లుకున్న కథనాలే సాక్ష్యం. 1945లో విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే కథనం మొదలు ఉత్తర్ ప్రదేశ్ లో, బెంగాల్లో సాధువుగా గడిపాడని చెప్పే ప్రచారాల వరకూ ఎన్నో వున్నాయి. వాటన్నటి సారాంశం ఒక్కటే. బోస్ కు మరణం లేదు. ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు. రష్యాలో వుండి వచ్చ. చైనాలో గడిపి వుండవచ్చు. కాదంటే ఉత్తరాదిలో చాలా మంది విశ్వసించే విధంగా సుభాష్ చంద్రబోస్ ఉత్తర్ ప్రదేశ్ లో గుమ్నామి బాబాగా స్థిరపడి వుండవచ్చు. ఇక కొంత మంది బెంగాలీలు 1970లలో ప్రచారం చేసినట్టు ఆయన శ్రీమత్ శారదానందజీ అనే సాధువుగా సిద్ధి పొంది వుండవచ్చు...

 


సుభాష్ చంద్రబోస్ చుట్టు అల్లుకున్న కథనాల్లో ఏది నిజం అన్నది ఇప్పటికీ పెద్ద శేష ప్రశ్నే! అది ఎప్పటికి స్పష్టం అవుతుందో కూడా చెప్పలేం. మోదీ సర్కార్ వరుసగా బయటపెడుతోన్న రహస్య డాక్యుమెంట్లు కూడా ఇప్పటి దాకా సంచలన విషయాలేం వెల్లడి చేయలేదు. కాబట్టి మరింత కొంత కాలం బోస్ వర్ధంతి లేని మహానాయకుడిగానే కొనసాగుతాడు. లేదంటే శాశ్వతంగా ఆయన మరణం పెద్ద మర్మంగానే మిగిలిపోవచ్చు! అయినా కూడా నష్టమేం లేదు... ఎందుకంటే, జయంతి మాత్రమే వుండి వర్ధంతి లేని వారు దేవుళ్లే! బోస్ భారతీయులకి దేవుడు కాక మరేంటి?