రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లకు అనుమతి...
Published on: Mon May 4, 2020 6:31PM
ఏపీలో కరోనా వైరస్ రాక తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రేపటి నుంచి తెరవాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... తిరిగి రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోన్నాయి. అయితే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్ఱభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.


