ఖబడ్దార్ కేసీఆర్.. ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత

 

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం పలు విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 'సీఎం.. డౌన్ డౌన్' అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

ఇంటర్ బోర్డు వద్దకు వెళ్తే ఎవరూ స్పందించని నేపథ్యంలో.. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.  పోలీసులు పలువురు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో వారు.. 'ఖబడ్దార్ కేసీఆర్' అని హెచ్చరిస్తూ.. విద్యార్థులతో చెలగాటమాడవద్దని, కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దృష్టిలో విద్యార్థులు దొంగలు, క్రిమినల్స్‌గా మారిపోయారని.. అందుకే ఇంత జరుగుతున్నా ఆయన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.