బాల్యాన్ని కాపాడుకుందాం....!!

బాల్యం కనపడడం లేదు. బాల్యం బాగుండడం లేదు. బాల్యం బరువులు ఎత్తుతోంది. బాల్యం భారాన్ని  మోస్తోంది. బాల్యమంటే బంగారం కదా...! బాల్యమంటే దాచుకోవాల్సిన నెమలీక కదా...! బాల్యమంటే కొన్ని గురుతుల సంగమం కదా...! నేడు నలభైలు దాటిన వారందరి బాల్యం దాచుకున్నదే కదా.... ఆనందంగా... "ఆ రోజుల్లో మేం" అని చెప్పుకుంటున్నదే కదా...! మరి ఈనాటి బాల్యానికి ఆనాటి మన బాల్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఆవకాయ కలిపి ఎర్రటి అన్నం ముద్దలు ఎందుకు తినిపించలేకపోతున్నాం. ఓ పలకా... బలపం... కొంచెం ఎదిగితే రెండంటే రెండే పుస్తకాలు.... ఇవే కదా ఆనాటి చదువుల వనరులు. మరి నేడెందుకు బండెడు పుస్తకాల బరువును బాల్యం నడుముకి కట్టేస్తున్నాం. నలభై.. ఏభై, అరవై ఏళ‌్ల  క్రితం వాళ్లే కదా.... ఇప్పుడున్న ఉన్నతాధికారులు. ప్రధానులు... ముఖ్యమంత్రులు... మంత్రులు...వారంతా సర్కార్ బడుల్లో చదువుకునే ఇప్పుడు ఈ స్థితిలో వచ్చారు.  ఈ నారాయణలు... చైతన్యలు కూడా చదువుకున్నది... మోసింది ఆ పాఠశాలలు.... ఆ తేలిక పాటి చదువులే కదా... మరి మనమెందుకు ఈనాటి బాల్యాన్ని కష్టాల పాలు చేస్తున్నాం.

 

 

దేశంలో బాల్యానికి సంకెళ‌్లు పడ్డాయి. ర్యాంకుల జైళ్లలోకి ఎప్పుడెప్పుడు తోసేద్దామా అని తలిదండ్రులు రెట్టించిన ఉత్సాహం చూపుతున్నారు. నిజానికి ఇరవై సంవత్సరాల క్రితమే బాల్యానికి దేశ బహిష్కరణ జరిగిపోయింది. మన దేశం నుంచి బాల్యం అనే పదం ఎప్పుడో ఎగిరిపోయింది. మనది బాల్యం లేని దేశంగా.... పసితనం ఎరుగని దేశంగా.... చిన్నారుల నిషేధిత దేశంగా "ఎదిగిపోయింది ". మన వాళ్లు అమెరికా విమానాలకు క్యూలు కట్టడం... డాలర్ల మాయకు దాసోహమవ్వడం ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే మన ఇళ‌్ల నుంచి బాల్యం గెంటివేయబడింది. పల్లెటూళ్లు లేవు... పట్టణాలు కనుమరుగవుతున్నాయి. నగరాలు అత్యంత ఆధునికతలో " ఊగిపోతున్నాయి". ఇక భవిష్యత్‌ని గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుంది. ఉండదు.. ఉండకూడదు. ఒకవేళ ఒకరిద్దరికి ఉన్నా.... వారు అమయాకులు...బతకడం చేత కాని వారు... తమ పిల్లల " భవిష్యత్‌ని కాలరాస్తున్నవారు". " మా అబ్బాయికి మూడో తరగతిలోనే ఫస్ట్ ర్యాంకు వచ్చింది.  మాది కోనసీమే అయినా... మా అమ్మాయికి తెలుగులో మాట్లాడడం రాదు. ఇంచక్కగా ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది" ఇది నేటి తలిదండ్రుల గొప్పతనం.

 

 

పరాయి భాష చుట్టంలాగో... ఆపదలో ఆదుకునే స్నేహతుడిలాగో ఉండాలి తప్ప తల్లి భాషలా... ఆ మాటకొస్తే తల్లినే ఏమార్చే భాషలా ఉండకూడదని మన జాతికి తెలియడం లేదు. బ్రిటీషు వారి పాలనలో తెలియక బానిసత్వంలో మగ్గిన భారతదేశం... ఇప్పుడు అన్నీ తెలిస.ి... కావాలనే... ఇష్టంతోనే....బానిసగా మారుతోంది. ఇదే ఇక్కడి అసలైన విషాదం. గందరగోళంలో పడి మన బాల్యం ఏం చేయాలో... ఎటు పోవాలో తెలియక అయోమయంలో ఉంది. దీన్ని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా తాత్కాలికంగా ఏమారుస్తున్నాయే తప్ప పట్టింపు లేకుండా ఉంటున్నాయి. దీనికి ఫలితం కొందరు ఇప్పుడే అనుభవిస్తున్నా... మరికొందరు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు. కాస్లులో ఇంగ్లీషు అర్ధం కావడం లేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీలో సీటు రాలేదని మరో అమ్మాయి ఏకంగా 13 అంతస్తుల నుంచి దూకేసి చచ్చిపోయింది. చిన్నతనం నుంచి గ్రామంలోనే పెరిగిన ఆ అబ్బాయికి ఇంగ్లీషు ఎలా అర్ధం అవుతుంది. ఇంగ్లీషు రానంత మాత్రాన తనువు చాలించాల్సిందేనా... మరి పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీటు రాకపోతే మరణమే శరణ్యమా.... ఈ చదువులు ఎవరు చెబుతున్నారు. 

 

 

 

ఏ క్లాసుకు సంబంధించి అయినా... ఏ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అయినా ఫలితాలు వస్తున్నాయంటే భయమేస్తోంది. ఎక్కడ ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని. చదువంటే మార్కులేనా... చదువంటే ర్యాంకులేనా... బాల్యమంటే పుస్తకాల మోతేనా.... అవే తప్ప మరింకేమీ లేకుండా చేసిన... చేస్తున్న ప్రభుత్వాలు... పాఠశాలలు... కళాశాలలను ఏం చేయాలి...? బాల్యానికి భరోసా ఇవ్వకుండా చేస్తున్న ప్రభుత్వాలను ఏం చేయాలి...? తాను పరీక్షలో తప్పినా... తన స్నేహితుడు పరీక్షలో నెగ్గాడనే ఆనందాన్ని తన తాతతో పంచుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మనమేం నేర్చుకోమా...? వీధి బడిలో చదువుకున్న అబ్దుల్ కలామ్ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడని తెలిసీ మనం ఇలాగే మిగులుదామా...? సంతకం కూడా చేయడం రాని టంగుటూరి అంజయ్య సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పని చేశాడని గుర్తు చేసుకోమా...? బాల్యాన్ని చిదిమేసి... ఛిద్రం చేసి... అసలు అది లేకుండా చేసేసి మానవ జన్మలో ఓ అపురూప దశను కనుమరుగు చేసేద్దామా..?

 

 

బాల్యం అనేది ఒకటుందని... అది అత్యంత అపురూపమని... నేటి తరానికి అర్ధం అయ్యేలా చెప్పలేమా...? వీడియో గేమ్స్... టీవీలో వచ్చే నానా చెత్త... తెలుగు సినిమాల్లో చిన్నారుల చేత చేయించే విచిత్ర వేషాలు.... కొత్తగా దిగుమతి అవుతున్న బ్లూవేల్ గెమ్స్ వంటి దారుణాల నుంచి బాల్యాన్ని రక్షించాలి కదా... దీనికి ఎవరు నడుం కడతారు... దీనికి ఎవరు ముందుకురుకుతారు... దీనికి ఎవరు తొలి అడుగు వేస్తారు... ఎవరో కాదు... మనమే... ప్రతి కుటుంబమే.... ప్రతి వ్యక్తే... ప్రతి తల్లే... ప్రతి తండ్రే... ప్రతి తాతే... ప్రతి మామ్మే... ప్రతి మామయ్యే... ప్రతి అత్తమ్మే.. దేశం కోల్పోతున్న బాల్యాన్ని దేశానికి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాజకీయ నాయకులూ... నేటి బాలలే... రేపటి మీ ఓటర్లు.... కనీసం అందుకోసమైనా ఈ మన బాల్యాన్ని కాపాడండి. అక్కున చేర్చుకోండి...