TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాట్సాప్‌లోనే విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్

Published on: Fri Apr 24, 2026 7:48PM

 

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రిపోర్ట్ కార్డులు ఇప్పుడు తల్లిదండ్రుల చేతికి చేరేందుకు స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదండోయ్. రిపోర్ట్ కార్డులు నేరుగా మీ ఫోన్ కే వస్తాయండోయ్...రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  ఈ డిజిటల్  కార్యక్రమంతో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ రిపోర్టులు నేరుగా వాట్సాప్ ద్వారా పంపిణీ అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 లక్షలకు పైగా విద్యార్థుల రిపోర్ట్ కార్డులు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు చేరాయి.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ సేవల ద్వారా అమలు చేసిన ఈ వినూత్న చర్య విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు నాంది పలికింది. సబ్జెక్టుల వారీగా మార్కులు, హాజరు శాతం వంటి పూర్తి వివరాలతో రిపోర్ట్ కార్డులు పంపించడం వల్ల తల్లిదండ్రులు వెంటనే పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకునే అవకాశం లభించింది. ఇక స్కూల్‌కి వెళ్లి రిపోర్ట్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయి. 

పూర్తిగా పేపర్‌లెస్ విధానం అమలు కావడంతో పరిపాలనలో పారదర్శకత, వేగం కూడా పెరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సాంకేతిక సేవలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగంలో సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలకు దారితీయనుందని అధికారులు భావిస్తున్నారు.