చర్చలు విఫలం..ఆస్పత్రుల్లో రోగుల హాహాకారాలు
Published on: Sun Feb 12, 2012 9:12AM
హైదరాబా
ద్: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మంత్రివర్గ ఉప సంఘం శనివారం రాత్రి వరకు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో జూడాలు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం సిద్ధమని మంత్రులు ఘాటుగానే ఆల్టిమేటం జారీచేశారు. చర్చల అనంతరం మంత్రులు మాట్లాడుతూ జూడాలు రాజకీయ దురుద్దేశంతోనే సమ్మె చేస్తున్నారని, ఇది సరైన చర్యకాదని వ్యాఖ్యానించారు. ఈ సమ్మెలో కొన్ని రాజకీయ పార్టీల జోక్యం ఉందని ఆరోపించారు. జూడాలు 30 రోజులుగా చేస్తున్న సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జూడాల 13 డిమాండ్లలో 11 డిమాండ్లను అంగీకరించామని అన్నారు. కేవలం రెండు డిమాండ్ల విషయంలో జూడాలు మొండికేస్తున్నారని తెలిపారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు జూడాలు పాల్పడుతున్నారని వైద్యవిద్యాశాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూడాల సమ్మె వల్ల రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వైద్యవిద్యాశాఖ మంత్రి సూచించినప్పటికీ జూడాలు వినిపించుకోలేదని మంత్రులు అన్నారు. ఇలావుంటే, రోగుల ప్రాణాల కంటే స్టయిఫెండ్ ముఖ్యమా అని ప్రశ్నించగా తాము కూడా ఆమరణ దీక్షలు చేస్తున్నామని తమ ప్రాణాలు కూడా ముఖ్యమేనని జూడాలు ఎదురు ప్రశ్నించారు. ఇప్పటికైనా జూడాలు పట్టువీడి సమ్మె విరమించాలని కోరారు. ఇలావుంటే, డాక్టర్లు అత్యవసర సర్వీసులను సైతం బహిష్కరిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టైఫండ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మాకు కొంత సమయం కావాలని అడిగామని మంత్రి గీతారెడ్డి అన్నారు. అత్యవసర సేవలు నిలిపివేయడం బాధాకరమన్నారు.


