చైనాపైన… ఇండియా యుద్ధం కాని యుద్ధం!

భారత్ పై చైనా యుద్ధం ప్రకటించింది! ఇది అందరికీ తెలిసిందే. కావాలనే ఆ దేశం కవ్విస్తోంది. ఒకవైపు డోక్లామ్ లో నెలల తరబడి తిష్టవేసి కయ్యానికి కాలుదువ్వుతోంది. మరో వైపు తాజాగా లద్ధాఖ్ లో కూడా లడాయికి దిగింది. కాని, బీజింగ్ లోని పాలకులు మాత్రం తమకేం తెలియదంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. మొత్తం మీద డ్రాగన్ ఎలాగైనా ఇండియాని కాల్పుల దాకా తీసుకొచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని తాపత్రయపడుతోంది. కాని, ఇండియా మాత్రం కూల్ గానే కనిపిస్తోంది. అయితే, మరో మూల నుంచి మోదీ సర్కార్ సైలెంట్ గా చైనాపై యుద్ధానికి దిగుతోందని నిపుణులు అంటున్నారు!

 

చైనాపై నిశ్శబ్ధ యుద్దామా అంటారా? అవును… నిశ్శబ్ద యుద్ధమే! పైగా ఇది చైనా మాదిరిగా ఆర్మీని ఉపయోగించి, రెచ్చగొట్టి, రాళ్లు రువ్వి, తోసుకుని, తిట్టుకునే కవ్వింపు కూడా కాదు. మరి ఏంటి అంటారా? ఇన్ డైరెక్ట్ వార్! డ్రాగ్ న్ను ఎక్కడ గిల్లితే ఆ దేశానికి బాగా మంట పుడుతుందో అక్కడ మెలిపెట్టాలని ఇండియా నిర్ణయించుకుంది. ఆల్రెడీ చర్యలు కూడా మొదలు పెట్టింది!

 

చైనాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( సీఈఏ ). ముందు ముందు భారతీయ పవర్ స్టేషన్లు, గ్రిడ్లు భద్రంగా వుండేందుకు, సైబర్ దాడులు జరక్కుండా వుండేందుకు తగిన చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అందుకోసం తగిన రోడ్ మ్యాప్ కూడా తయారవుతోందని స్వయంగా విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇక మీదట కాంట్రాక్టులు ఇచ్చేప్పుడు ఇండియన్స్ కి , ఇండియన్ కంపెనీలకి తొలి ప్రాధాన్యత వుంటుందని ఆయన అన్నారు. త్వరలోనే చైనీస్ కంపెనీలకు రకరకాల రూల్స్ తో చెక్ పెట్టనున్నారు. పదేళ్ల నుంచీ సదరు కంపెనీ ఇండియాలో కొనసాగుతూ వుండాలి, కంపెనీ టాప్ పొజీషన్లలో భారతీయ పౌరులు వుండి వుండాలి, ఇలాంటివే నిబంధనలే కాక మరికొన్ని టెక్నికల్ రూల్స్ కూడా చైనా కంపెనీలకు చుక్కలు చూపించే అవకాశాలున్నాయి…

 

విద్యుత్ రంగంలోనే కాదు టెలికామ్ రంగంలోనూ కామ్ గా తన పని తాను చేసుకుపోతోంది ఇండియా. కొద్ది రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం పాటిస్తోన్న భద్రతా పరమైన చర్యలు తెలపాల్సిందిగా… ఎలక్ట్రానిక్స్ , ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 21 కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది! సహజంగానే వీటిలో అత్యధిక కంపెనీలు చైనీస్! జియోమీ, లెనోవో, ఓప్పో, వివో, జియోనీ లాంటి కోట్లాది రూపాయలు గడిస్తోన్నవి అన్నీ వున్నాయి…

 

విద్యుత్, టెలికామ్ తో మొదలైన ఈ ఇన్ డైరెక్ట్ వార్ ముందు ముందు ఇతర రంగాలకు కూడా విస్తరించవచ్చని నిపుణులు అంటున్నారు. చైనాకు ఇండియాలో లక్షల కోట్ల మార్కెట్ వున్నా తెంపరితనంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. అలాగే, మరో వైపు పాకిస్తాన్ తో కలిసి దుర్మార్గ రాజకీయం చేస్తోంది. ఇన్ని చేస్తూ కూడా అప్పన్నంగా ఇండియా నుంచి కోట్లు డండుకోవాలని నిర్ణయించుకుంది. ఇది జరక్కుండా వుండేలా కఠిన చర్యలు మొదలు పెట్టింది భారత్. ఇది మన లోకల్ కంపెనీల సంక్షేమం దృష్ట్యా కూడా తక్షణ అవసరం అంటున్నారు జాతీయవాదులు.

 

ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు స్పష్టంగా తమ మద్దతు ఇండియాకు ప్రకటించాయి. అమెరికా కూడా మన వైపునే మాట్లాడుతోంది. ఈ రాజకీయ వ్యూహం కాకుండా ఆర్దికంగా కూడా చైనాను కట్టడి చేయటం తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమే!