కోడి రామకృష్ణ నుదుటిపై బ్యాండ్.. ఎలా అలవాటైందో తెలుసా?

 

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈరోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన. టాలీవుడ్ కి ఎన్నో మరపురాని హిట్లు ఇచ్చారు. కోడి రామకృష్ణ పేరు వినగానే దేవుళ్ళు, దేవి, అరుంధతి, అంకుశం, మంగమ్మ గారి మనవడు ఇలా ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఆయన పేరు వినగానే ఆయన హిట్ సినిమాలు మాత్రమే కాదు మరొకటి కూడా గుర్తుకొస్తుంది. అదే ఆయన నుదుటిపై ఉండే బ్యాండ్. ఆయన ఎప్పుడూ బ్యాండ్ కట్టుకునే కనిపిస్తారు. అసలు ఆయనకు ఆ బ్యాండ్ కట్టుకోవడం ఎలా అలవాటు అయిందో తెలుసా?.

ఆయన రెండో సినిమా 'తరంగిణి' షూటింగ్‌ కోవలం బీచ్‌ దగ్గర జరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ బాగా ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ కాస్ట్యూమర్‌ మోకా రామారావు అక్కడికి వచ్చి.. ‘మీ నుదురు విశాలంగా ఉంది. ఎండ ఎక్స్‌పోజర్‌ అవుతుంది.’ అంటూ ఒక జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమన్నారు. అలా కోడి రామకృష్ణ ఆరోజంతా రుమాలు కట్టుకొని ఉన్నారు. మరుసటి రోజు షూటింగ్ ప్రారంభమైంది. మళ్ళీ మోకా రామారావు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి రుమాలుని బ్యాండ్‌లా తయారుచేసుకుని తెచ్చి.. ‘దీనికి మీకు ఏదో బంధం ఉందండి. అందరికీ మ్యాచ్‌ అవ్వదు. మీకు బాగా సూటయింది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు’ అంటూ కోడి రామకృష్ణకు ఇచ్చారు. అప్పట్నుంచి షూటింగ్‌ టైమ్‌లో బ్యాండ్‌ కట్టుకోవడం ఆయనకు అలవాటు అయింది. తరువాత అదే సెంటిమెంట్‌ గా మారిపోయింది.