వల్లభనేని వంశీకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్!
Published on: Wed Nov 9, 2022 11:30AM
వల్లభనేని వంశీమోహన్. గన్నవరం ఎమ్మెల్యే. తెలుగుదేశం గుర్తుపై గెలిచిన వంశీ ఆ తరువాత జగన్ చెంతకు చేరారు. వంశీకి వాచాలత ఎక్కువ అన్న విషయం రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ తెలిసిందే. ఆ మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధాన్నే సృష్టించాయి. వంశీ వ్యాఖ్యలు చివరికి శాసనసభలోకి కూడా చొరబడ్డాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సభలోనే తీవ్ర అవమానం జరిగింది. అంతటి అవమానాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు ‘ఈ కౌరవ సభలో ఉండను.. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతా’ అని భీషణ ప్రతిజ్ఞ చేసే దాకా వ్యవహారం వెళ్లడానికి వల్లభనేని వంశీ వ్యాఖ్యలే ప్రధాన కారణం అని చెప్పాలి.
అలాంటి వంశీకి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఓ మహిళ తల మైండ్ బ్లాక్ అయిపోయే కౌంటర్ ఇచ్చారు. నోరు మూయించారు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేసే వంశీ ఆ మహిళ కౌంటర్ తో మళ్లీ నోరు ఎత్తకుండా చేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో వల్లభనేని వంశీ ఏమి చేయాలో… ఏమి చెప్పాలో తెలియక తికమక పడిపోయారు. విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..
వైసీపీ ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పర్యటిస్తుండగా సీహెచ్ భవాని అనే మహిళ ఆయనను నిలదీశారు. ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు’ అన్నారు. ‘మీ ముఖ్యమంత్రి జగన్ ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తిరిగి తీసుకురండి’ అని కోరారు.
సమస్యల గురించి భవాని చెబుతుండగానే.. వల్లభనేని వంశీలో వెటకారం తన్నుకొచ్చింది. ఆమెను ఉద్దేశించి ‘చూడండి అక్కా. మీరు ‘ఆ రెండు పత్రికలు’ బాగా చదువుతున్నట్లున్నారు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే.. భవాని మాత్రం స్పాంటేనియస్ గా ‘వాటివల్లేగా మీరు పైకొచ్చింది’ అంటూ రిటార్డ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవడం అక్కడ ఉన్నవారందరి వంతు అయింది.
దీంతో తడబాటును కొద్దిగా తమాయించుకుని.. ‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అనగానే.. భవానీ కల్పించుకుని ‘మీరు ఇంకా హైదరాబాద్ నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అని మళ్లీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. భవానీ మాటలతో ఏం జవాబు చెప్పాలో తెలియని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిత్తర చూపులు చూశారంటున్నారు.


