ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రవీంద్ర...ఏపీ సీఎం సెక్యూరిటీ కోసమా ?

 

ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను  తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారు. 

నిజానికి స్టీఫెన్ రవీంద్ర తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ గల ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో మొదటగా వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004లో ఆడిషనల్ ఎస్పీగా అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పని చేశారు. తర్వాత, వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత అక్కడి ఫ్యాక్షన్ ను కంట్రోల్ చేసి మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. 

తరువాత అప్పటి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు  వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయన మారారు. వైఎస్ మరణానంతరం 2009లో కరీంనగర్ ఎస్పీగా ఆయన భాద్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కట్టడి చేయగలిగారు.

ఇక ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు ఇప్పుడు ఆయన ప్లేస్ లోనే ఈయన ఛార్జ్ తీసుకోనున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ఈ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు ఉండేవారు. చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండేవి. 

పోలీసు అధికారిగా కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ వెంకటేశ్వరరావు చెబితేనే సీఎం అమలు చేస్తాడని వైసీపీ ఆరోపించింది. అంతే కాక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏబీ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలున్నాయి. పోలీస్‌ అధికారిగా కాకుండా బాబు పార్టీ కార్యకర్తగా ఆయన పని చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మరి అలాంటి కీలక పదవిలో తమకి అనుకూలంగా సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రని తెచ్చి పదవిని కట్టబెట్టడం ఎంతవరకు లాభిస్తుందో చూడాలి మరి.