TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రెజిల్‌లో నేలకొరిగిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం

Published on: Tue Dec 16, 2025 2:10PM

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో తుఫాను బీభత్సానికి  స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది. 79 అడుగుల ఎత్తు ఉన్న ఈ  విగ్రహం తుపాను ధాటికి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు కుప్పకూలింది.  ఇలా ఉండగా బ్రెజిల్ ను తుపాను అతలాకుతలం చేసింది.  రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గుయైబా నగరంలో సంభవించిన తీవ్ర తుఫాను ధాటికి  స్థానిక రిటైల్ స్టోర్ హవాన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన  79 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి చూస్తుండగానే ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన  ప్రభుత్వం  ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, అక్కడి నుంచి వాహనాలను తరలించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.  

విగ్రహం కూలిపోయిన ఘటనను గుయైబా మేయర్ మార్సెలో మరానటా సోషల్ మీడియాలో ధృవీకరించారు. హవాన్ సిబ్బంది తక్షణమే ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.   ఇక హవాన్ మెగాస్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని సదరు కంపెనీ స్పష్టం చేసింది.

మరోవైపు.. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ తుఫాను హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయడానికి మొబైల్ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపించింది. తుఫాను, బలమైన గాలులు, కూలిపోయే ప్రమాదం ఉన్న నిర్మాణాల గురించి హెచ్చరించింది. తీవ్రమైన వేడి, శీతల గాలి కలయికతో ఏర్పడిన ఈ అల్పపీడన వ్యవస్థ కారణంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో ఈ తుఫాను సంభవించింది. గతంలో 2021లో కాపావో డా కానోవాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, తుఫాను సమయంలో మరో హవాన్ విగ్రహం కూలిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.