ఎన్నికల ప్రచారంలో 2,500 మంది విద్యార్ధులు
Published on: Fri Mar 9, 2012 12:51PM
హైదరాబాద్: స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో తెలంగాణా రాష్ట్రసమితి పార్టీ తరపున సుమారు 2,500మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు. వీరంతా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల ఐక్యకార్యాచరణ సమితి విద్యార్ధులు. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 25 మంది విద్యార్ధులను కేటాయించారు. వీరు ఉదయాన్నే నిద్రలేచి అల్పాహారం తీసుకుని ప్రచారసామాగ్రితో ఇంటింటికీ తిరుగుతు తెరాస అభ్యర్ధి రాజారపు ప్రతాప్ ను గెలిపించాలనికోరుతున్నారు. అంతేకాక ఆయా గ్రామాల్లో ఇంటర్, డిగ్రి, ఇతర ఉన్నత చదువులు చదివిన వారిని ప్రభావితం చేస్తున్నారు. వారిని తమతోపాటు ప్రచారానికి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరిస్తున్నారు. మధ్యాహ్నం కూడా వీరు ఎక్కడో ఒకచోట పార్టీనుంచి అందే భోజనాన్ని స్వీకరించి సాయంత్రం వరకూ మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా వారు పల్లెల్లోనే నిద్రిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం వ్యూహాలను తెలుసుకుంటున్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఓటింగ్ సమయానికి సొంత వూరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నారు. వీరందరితో తెరాస నేతలు హరీష్ రావు, విజయరామారావు, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు పరిస్థితులకు సమీక్షిస్తున్నారు.


