TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీకి ‘రాష్ట్ర రాజకీయం’

Published on: Sat Feb 18, 2012 8:36AM

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌లో సాగుతోన్న అసమ్మతి రాజకీయ యుద్ధం ఢిల్లీకి పాకింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గాల మధ్య రాష్ట్రంలో కొనసాగుతున్న ‘రాజకీయం’ హైకమాండ్ ముందుకొచ్చింది. పిసిసి మాజీ అధ్యక్షుడు, విధాన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను సోనియా దృష్టికి తెచ్చినట్టు ఆయన తనను కలిసిన మీడియాతో చెప్పారు. 2014లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శ్రీనివాస్ చెప్పారు. ఇదిలావుంటే, కిరణ్‌కుమార్ రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆర్ దామోదర్ రెడ్డి శుక్రవారం హోంమంత్రి పి చిదంబరాన్ని కలిసి రాష్ట్ర రాజకీయాలపై తమ వాదన వినిపించారు. పిసిసి అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు ఒక వ్యక్తికి ఒక పదవి విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అంతటితో ఆగకుండా శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు కూడా ఎసరు పెట్టారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. పదవుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ, ఈ నష్టాన్ని పూడ్చాలంటే పిసిసి అధ్యక్ష పదవి, స్పీకర్ పదవులను తెలంగాణ వారికి కేటాయించాలని చిదంబరాన్ని కోరారు. కిరణ్‌కుమార్ రెడ్డిపై కొందరు సీనియర్ నేతలు కొనసాగిస్తున్న అసమ్మతి రాజకీయాల గురించి ఆయన హోంమంత్రికి వివరించారు.