TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వై.ఎస్.ను తిట్టుకుంటున్న రాష్ట్ర మంత్రులు !

Published on: Sat May 26, 2012 10:08AM

జగన్ అక్రమ ఆస్తుల కేసుతో ముడిపడిన ఆరుగురు మంత్రులకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఒకనాడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడూ అంటూ పొగిడిన మంత్రివర్యులే ఇప్పుడు ఆయన్ను తిట్టుకుంటున్నారు. ఆయనవల్లే తమకు అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఇప్పుడు వాపోతున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు తర్వాత అక్రమ జీవోల జారీలో ప్రమేయం ఉన్న మిగిలిన మంత్రులు తమను కాపాడాలని ఢిల్లీలోని నేతలను ఆశ్రయిస్తున్నారు. తమకు రక్షణ కల్పించకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

 

 

సాక్షాత్తూ రాష్ట్రముఖ్యమంత్రికి కూడా తెలియకుండా మంత్రిని సీబీఐ కస్టడీకి తీసుకోవటం మిగిలిన మంత్రులకు మింగుడు పడనీయటం లేదు. ప్రత్యేకించి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరుల బాధ ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రితో అత్యవసరంగా జరిగిన మంత్రుల సమావేశంలో వై.ఎస్. తమను ముంచేశారని, కాపాడాలని మంత్రులు గగ్గోలు పెట్టారట. రెండున్నర గంటలసేపు ఈ సమావేశం జరిగితే తమను రక్షించమని సిఎంను వేడుకున్నారట. దీనితోనూ ఆందోళన ఆగక మంత్రులు తమకు అనుకూలంగా ఉండే ఢిల్లీ నేతలతో మాట్లాడి తమను కాపాడాలని కోరుతున్నారు. తమను రక్షిస్తే కాంగ్రెస్ పార్టీ కోసం తామేదైనా చేయటానికి వెనుకాడబోమని కూడా హామీలు గుప్పిస్తున్నారు. జగన్ ను సిబీఐ ప్రశ్నించటం, ఆ తరువాత ఆయన అరెస్టు ఖాయమైతే తమవంతు వెనకాలే ఉంటుందని మంత్రులు చెప్పుకుంటున్నారు. మరి సిబీఐ పరంగా చూస్తే ఒక్కొక్క కేసునూ విడివిడిగా పర్యవేక్షిస్తోంది. అందువల్ల జగన్ అరెస్టుకు మంత్రుల అరెస్టులకు మధ్య కొంత సమయం తేడా ఉండొచ్చని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే మంత్రులైనా చట్టం ముందు ఒక్కటేనన్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.