ప్రభుత్వ భూమికి టెండరు పెట్టిన మంత్రి పొన్నాల
Published on: Mon Apr 2, 2012 8:17AM
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా స్వాహా చేశారు. సుమారు రూ. 15 కోట్ల విలువచేసే భూమిని లక్ష్మయ్య తన పలుకుబడిని ఉపయోగించి కేవలం రూ. 3 లక్షలకే స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రాంపూర్ లో పొన్నాల లక్ష్మయ్య 2005లో తిరుమల హేచరీస్ పేరిట ఈ భూమిని కారు చౌకగా తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి సుమారు కోటి రూపాయల ధర పలుకుతుండగా 2005లో మంత్రి పొన్నాల ఎకరాకు కేవలం రూ. 25వేలు మాత్రమే చెల్లించారు. అయితే ఆయన తన భూమిని పూర్తిగా హేచరీకి వాడకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విషయం ఇటీవల బయటపడటంతో ప్రతిపక్షాల నాయకులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల హేచరీస్ పేరిట అప్పనంగా ప్రభుత్వ భూమిని కాజేసిన పొన్నాల లక్ష్మయ్య వెంటనే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని, లేకపోతే తామే స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లపట్టాలుగా ఇస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, ఎం. చుక్కయ్యాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీరిని మేనేజ్ చేసే బాధ్యతను మంత్రి తన అనుయాయులకు అప్పగించినట్లు తెలిసింది.


