భూసర్వేశాఖకు భూస్థాపితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Published on: Thu Mar 8, 2012 10:11AM
హైదరాబాద్: భూసర్వే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భూస్థాపితం చేసింది. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు కావాలంటే ముందుగా భూమి స్వభావం తెలుసుకోవాలి. భూమి స్వరూప స్వభావాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం భూసర్వే విభాగం ప్రధాన విధి. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధీనంలో ఈ విభాగాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఎంతో కీలకమైన ఈ విభాగాన్ని ప్రభుత్వం నీరుగార్చేస్తోంది.ప్రాజెక్టుల విభాగంలో భూసర్వే డిజైన్ రూపకల్పన బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోంది. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రైవేట్ సంస్థలనుంచి పెద్దఎత్తున ముడుపులు కూడా పొందుతున్నారు. భూసర్వే విభాగానికి ఉద్యోగులు లేకుండా చేసింది. అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఈ విభాగం కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రైవేట్ కంపెనీలు భూసర్వేలను ఇష్టానుసారంగా చేస్తూ తప్పుడు నివేదికలను ఇస్తున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంతో కీలకమైన భూసర్వే విభాగాన్ని తిరిగి ప్రారంభించవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.


