ఒక ఎన్నికలు… ఒకేసారి ఎన్నికలు… ఓకేనా?


ఎన్నికలు… ఈ పేరు చెప్పగానే పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీలు, మీడియా, జనం… ఇలా అంతటా, అన్నిటా, అందరిలో ఆసక్తి మొదలవుతుంది! అయితే, అదే టైంలో కీలకమైన ఎలక్షన్స్ వస్తున్నాయంటే టెన్షన్ కూడా మొదలవుతుంది. భారతదేశం లాంటి భారీ దేశంలో కోట్లాది మంది ఓటర్లు వుంటారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షులు, ప్రధానుల్ని ఎన్నుకునే ఓటర్ల సంఖ్య కంటే మన దగ్గర మున్సిపల్ కార్పోరేషన్లకు ఓటు వేసే వారి సంఖ్య ఎక్కువ! ఇక పార్లమెంట్ ఎన్నికలు వస్తేనైతే ఆరు నెలల కోలాహలం! కోట్లాది మంది క్యూలైన్లలో నిలబడే ప్రజాస్వామిక కుంభమేళా!

 

ఎన్నికలు లేకుంటే అసలు ప్రజాస్వామ్యమే వుండదు. అందుకే, ఎన్నికలు, అదీ పారదర్శకమైన ఎన్నికలు వుండాలి. కాని, మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, అయిదేళ్లకొకసారి దేశానికి ఎన్నికలు, ఆ అయిదేళ్ల మధ్య కాలంలో ఎక్కడో అక్కడ అసెంబ్లీల ఎన్నికలు, అవి చాలవన్నట్టు పదే పదే మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలు… ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. వీటి వల్ల లాభం వుందన్నది అందరూ ఒప్పుకునేదే! ఎన్నికలు జరుగుతుంటేనే పాలన కొనసాగేది. కాని, ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఎన్నికలు తన్నుకొచ్చేయటంతో… పాలన బాగా జరగటం కంటే ఎక్కువగా కుంటుపడుతోంది! అదీ అసలు సమస్య!

 

భారతదేశంలోని ముప్పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏవో ఒక ఎన్నికలు ఎల్లప్పుడూ జరుగుతూనే వుంటాయి. చిన్న చిన్న ఓట్ల పండుగలు పక్కన పెట్టినా పెద్ద పెద్ద వాటి వల్ల అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడుతుంటాయి. కారణం… ఎలక్షన్ కోడ్ అమలు కాగానే ఎలాంటి ప్రధాన నిర్ణయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకూడదు. అంతే కాదు, త్వరలో ఎలక్షన్స్ అంటే… ఏ పార్టీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు  కొన్ని నెలల ముందు నుంచే తీసుకోదు! జనాన్ని మచ్చిక చేసుకునే విధంగా సంస్కరణల్ని పక్కన పెట్టేస్తుంది. అంటే అభివృద్ధి ఆగిపోతుందన్నమాట! ఇక ప్రతీ సంవత్సరం ఏదో ఒక చోట భారీ ఎన్నికలు జరుగుతూనే వుంటే… మన ప్రభుత్వాలు ధైర్యంగా సంస్కరణలు చేపట్టేది ఎప్పుడు? అభివృద్ది ఫలాలు అందేది ఎప్పుడు?

 

బీజేపీకి ప్రధానిగా వున్న మోదీయే స్టార్ క్యాంపైనర్. ఆయన ఎక్కడ ఎన్నికలు జరిగినా దిల్లీలోని పనులన్నీ ఆపుకుని ప్రచారానికి వెళ్లాలి. ఇదే పరిస్థితి చాలా ప్రాంతీయ పార్టీల సీఎంలది. ఎన్నికలు అనగానే వారు పనులు పక్కన పెట్టి జిల్లాలు తిరుగుతుంటారు. ఇలా ఎన్నికల వల్ల ప్రధాని, ముఖ్యమంత్రులు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని ఒత్తిడికి గురవుతున్నారు!

 

పదే పదే ఎన్నికల వల్ల జరుగుతోన్న నష్టాన్ని నివారించేందుకే మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం తీసుకొస్తున్నారు. దీని ప్రకారం 2018 చివర్లో ఎలక్షన్ పండగ జరగవచ్చు! ప్రధానమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే ఒకేసారి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమీషన్ కూడా భావిస్తోంది! నీతీ ఆయోగ్ మీటింగ్ లో మోదీ ఒకేసారి ఎన్నికలపైన తమ తమ అభిప్రాయాల్ని చెప్పాలని అన్ని రాష్ట్రాల్ని కోరారు!

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగే మరి కొన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పార్లెమెంట్ తో కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో మిగతా రాష్ట్రాల అసెంబ్లీల్ని కూడా ముందస్తుగానో, లేదంటే, కాస్త ఆలస్యంగానో ఎన్నికలకు సిద్ధం చేస్తే ఒకేసారి ఓటింగ్ పెట్టటం కష్టమేం కాదు. దీని వల్ల ప్రధానంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు వేగంగా, ధైర్యంగా తీసుకోగలుగుతాయి. ఒక్క సంవత్సరం ఎన్నికల కోసం ఖర్చైనా… మిగిలిన నాలుగు యేళ్లూ మరే ఎన్నికల భయం లేకుండా సంస్కరణలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా సాగవచ్చు!

 

దేశంలోని అత్యధిక రాష్ట్రాలు బీజేపీ చేతిలో, బీజేపి మోదీ చేతిలో, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఆయన మనస్సులో వుంది కాబట్టి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ త్వరలోనే నిజం అవుతుందని భావించవచ్చు!