రాష్ట్ర బంద్ ఎందుకు - యనమల 

కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆర్థిక మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ను కేంద్రం నీరుకారుస్తోందని, భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. కేంద్రం తన ఆలోచనలను రాష్ట్రాలపై రుద్దుతోందని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రానికి ఎక్కడ లాభం వస్తుందో అక్కడే శ్రద్ధ చూపిస్తోందన్నారు.

 

 

అధికారుల కమిటీలను, భాజపా మంత్రుల కమిటీలను ఉపయోగించి కేంద్రానికి లాభకరమైన అంశాలనే ఆమోదించి, అంతా తామే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని యనమల విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి వైకాపా, జనసేన మూలస్తంభాలుగా మారాయని యనమల విమర్శించారు. ఆ మూడు పార్టీలు లాలూచీ పడ్డాయని ఆరోపించారు. వైకాపా, జనసేన దృష్టి అంతా ముఖ్యమంత్రి కుర్చీమీదే ఉందని దుయ్యబట్టారు. మంగళవారం నాటి రాష్ట్ర బంద్ ఎందుకు అని జగన్‌ను ప్రశ్నించారు. రాజీనామాలను ఆమోదించుకోవడం ద్వారా లోక్‌సభలో మేజిక్ ఫిగర్ తగ్గించి భాజపాకి మేలు చేశారని, వైకాపా 100 శాతం భాజపాతోనే ప్రయాణిస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. వినాశకర రాజకీయ పార్టీలుగా వైకాపా, జనసేనను ప్రజలు భావిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుతారని యనమల అన్నారు.