అప్పుడు కుస్తీ...ఇప్పుడు దోస్తీ
Published on: Tue Feb 28, 2012 2:07PM
స్టేషన్ ఘన్ పూర్ లో విచిత్ర పరిస్థితి
హై
దరాబాద్: ఒకప్పుడు ప్రత్యర్ధులుగా కుస్తీపత్తులు పట్టుకున్నారు. ఇప్పుడు దోస్తులుగా కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన రాజకీయ చిత్రం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి టిఆర్ఎస్ లో ఉన్న ముగ్గురు ప్రముఖ నాయకులు ఖచ్చితంగా వర్తిస్తుంది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఉండే విజయరామారావు, టిడిపి అభ్యర్ధిగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ తాటికొండ రాజయ్య పోటీపడ్డారు. అప్పుడు కడియం శ్రీహరి గెలుపుజెండా ఎగురవేశారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుతో కడియం శ్రీహరి టిడిపి అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ తాటికొండ రాజయ్య, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా రమేష్ పోటీపడ్డారు. ఇప్పుడు తాజాగా డాక్టర్ రాజయ్య, విజయరామారావు, రమేష్ టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న రాజయ్యకు విజయ రామారావు, రమేష్ మద్దతుగా నిలిచారు. క్రితంసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచినా రాజయ్యకు మద్దతుగా ఉన్న రాజారపు ప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు.
ఇదిలా ఉండగా టిఆర్ఎస్ లో తాజాగా ఈ ముగ్గురు నాయకుల విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో రాజయ్యకు 68వేల ఓట్లు, శ్రీహరికి 56వేల ఓట్లు, రమేష్ కు 26వేల ఓట్లు పోలయ్యాయి. అలాగే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయరామారావుకు 31వేల ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఈ ముగ్గురు నాయకులు ఆయా పార్టీల అభ్యర్ధులుగా బరిలో నిలిచినప్పుడు పోలైన ఓట్లశాతం మొత్తంగా కలుపుకుంటే అత్యధికంగా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు టిఆర్ఎస్ గెలుపుకోసం పనిచేస్తున్నందున ఆ పార్టీ అభ్యర్ధి రాజయ్య విజయం నల్లేరు పై నడకలాగా ఉంటుందని ఆశిస్తున్నారు.


