స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మూగనోము

 

ఆఖరి బంతి వరకు పోరాడతాను.. రాష్ట్రం కన్నా పదవి పార్టీ ముఖ్యంగా కాదు.. నేను పదవిలో ఉండగా రాష్ట్రం విడిపోదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి ఎవరినైనా ఎదిరిస్తాం.. ఈ మాటలు వింటుంటే బి గోపాల్‌ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ రాసిన డైలాగ్స్‌లా అనిపిస్తున్నాయి కదా.. ఇవన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు రాష్ట్ర విభజన విషయంలో చేసిన కామెంట్స్‌..


మరి ఇంతలా బీరాలు పలికిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు.. తాను పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరగదు అని తెగేసి చెప్పిన కిరణ్‌. ఇప్పుడు తాను ఉన్న సభలోనే తెలంగాణ ఏర్పాటుకు సంబందించిన బిల్లు చర్చ జరుగుతుంటే కిరణ్‌ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. ఇన్నాళ్లు ఆఖరి బాల్‌ పడే వరకు పోరాడతానన్న కిరణ్‌ ఇఫ్పుడు మాత్రం అధిష్టానానికి జీహుజూర్‌ అంటున్నట్టుగా కనిపిస్తుంది.

తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చే వరకు తన వాదన బలంగా వినిపించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి బిల్లు అసెంబ్లీకి చేరిన తరువాత మాత్రం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు.. ఎవరు ఏమి అనుకోకుండా ఒకటి రెండు స్టేట్‌మెంట్లు ఇస్తున్నా గతంలో వినిపించినంత బలంగా వాయిస్‌ వినిపించటం లేదు. కిరణ్‌లో వచ్చిన ఈ మార్పులను రాజకీయ విశ్లేషకులు కూడా పలురకాలుగా విశ్లేషిస్తున్నారు.

అయితే సమైక్య వాణి బలంగా వినిపించిన కిరణ్‌: సొంత పార్టీ పెట్టో ఆలోచనలో ఉన్నట్టు గతంలో బాగా టాక్‌ నడించింది. అదే సమయంలో సీమాంద్ర జిల్లాల్లో తనకున్న పట్టు ఎంతో తెలుసుకోవడానికి ఓ సర్వే కూడా చేయించుకున్నాడట.. కిరణ్‌ మౌనానికి ఈ సర్వే కూడా కారణం అంటున్నారు ఆయన సన్నిహితులు. సొంత పార్టీ పెట్టాలనుకున్న కిరణ్‌కు రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉందని తెలిసి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిందట.

సర్వే ఫలితాలతో పాటు, బిల్లు కన్నా ముందే రాష్ట్రనికి వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌ మంత్రాంగం కూడా కిరణ్‌లోని మార్పుకు కారణం అన్న టాక్‌ బలంగా వినిపిస్తుంది. మరి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా తనని తాను చెప్పుకున్న కిరణ్‌. ఇప్పుడు ఎలాంటి స్టెప్‌ తీసుకుంటాడో చూడాలి.