కేసీఆర్ కు షాకిచ్చిన స్టాలిన్.. మీరే మాతో కలిసి రండి
Published on: Tue May 14, 2019 2:40PM

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి మద్దతు కోరారు. ఇప్పుడు తాజాగా సోమవారం డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సుమారు ఇరువురు నేతల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది. జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ వస్తే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటాయని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ స్టాలిన్ ను కోరినట్టు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ కు స్టాలిన్ ఊహించని షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాము బీజేపీయేతర కూటమిలో ఉన్నామని, అవకాశం ఉంటే మీరు కూడా బీజేపీయేతర కూటమిలో చేరాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరారట. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని స్టాలిన్ తేల్చి చెప్పారట. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ స్టాలిన్ మాత్రం తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ కే అని తేల్చి చెప్పి.. కేసీఆర్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


