మోదీని అధికారం నుంచి వెంటనే దించేయాలి
Published on: Tue Aug 28, 2018 3:44PM
కరుణానిధి మరణంతో 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి మార్పు జరిగింది.. డీఎంకే అధ్యక్షుడిగా ఆయన కుమారుడు ఎం.కె.స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్.. ఇంతకు ముందులా కాదని, ఇప్పుడు తాను సరికొత్త స్టాలిన్‌నని అన్నారు.. కరుణానిధి మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని.. కరుణానిధి రాష్ట్రం కోసం, దేశం కోసం ఎంతో సేవ చేశారని.. పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

అదే విధంగా రాష్ట్రంలోని అన్నాడీఎంకే పై కేంద్రంలోని బీజేపీపై స్టాలిన్ మండిపడ్డారు.. అన్నాడీఎంకే ప్రజల కోసం పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారికెప్పుడూ పదవుల కుమ్ములాటలే కానీ, ప్రజల సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు.. ఇక దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, దేశ ప్రజలను మతాలుగా విడదీసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.. దేశంలో జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే మోదీని అధికారం నుంచి వెంటనే దించేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.. డీఎంకే, బీజేపీకి దగ్గరవుతుందని వార్తలు వినిస్తున్న సమయంలో స్టాలిన్, మోదీపై విమర్శలు చేయటం ఆసక్తిని రేపుతున్నాయి.. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.


