హైకోర్టు జడ్జిగా 'శ్రీశ్రీ' కుమార్తె.. ఆమె వివరాలు ఇవే..
Published on: Fri Mar 25, 2022 11:47AM
శ్రీశ్రీ తెలుసుగా. ఈ జనరేషన్ వారిలో అందరికీ తెలీకపోయినా.. ఇంతకుముందు తరం వారందరికీ పరిచయం అక్కరలేని పేరు. అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అయినా.. శ్రీశ్రీగా ఫుల్ పాపులర్. సుప్రసిద్ధ రచయిత. మహా ప్రస్థానంతో తెలుగునాట కొత్త విప్లవ బీజాలు నాటారు. యువతరాన్ని తట్టి లేపారు. వారి రక్తంలో చైతన్యం నింపారు. మహా ప్రస్థానం ఉన్నన్నాళ్లు శ్రీశ్రీ ఉంటారు. మహాకవిగా తెలుగజాతి చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.
శ్రీశ్రీ-సరోజా దంపతులకు నలుగురు పిల్లలు. అందులో చిన్న వారైన.. ఆయన కుమార్తె.. నిడుమోలు మాలా.. తాజాగా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్.సౌందర్‌ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులు జారీ చేశారు.
మాలా మద్రాస్ లా కాలేజ్‌లో డిగ్రీ చదివారు. 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. గడిచిన 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. తాజాగా, అదే మద్రాస్ హైకోర్టుకు అదనపు జడ్జిగా నియమితులయ్యారు.
2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా మాలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. వారిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. మాలా-రాధారమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్ జయప్రకాశ్ కూడా హైకోర్టులో న్యాయవాదే. శ్రీశ్రీ కుమార్తె న్యాయమూర్తి అయ్యారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



