సీఎం జగన్‌పై స్వామిజీ తీవ్ర ఆగ్రహం.. భక్తులు తిరగబడతారని శాపం..
Published on: Sun Sep 5, 2021 1:42PM
రెండేళ్లుగా ఏపీలో అల్లకల్లోలం. ఓవైపు అవినీతి, అక్రమాలు, అరాచకాలు. మరోవైపు.. మత మార్పిడిలు, ఆలయాలపై దాడులు, హిందుత్వంపై కుట్రలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయనే ఆందోళన. ఇవి చాలవన్నట్టు.. వినాయక చవితికి బ్యాంకులకు సెలవు ఇవ్వకపోవడం, తాజాగా చవితి వేడుకలకు పర్మిషన్ ఇవ్వకపోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఏపీలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనాను అడ్డుపెట్టుకుని సీఎం జగన్ వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపతి నవరాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటని, ఏ పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని.. హిందూత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రశ్నించారు. ‘‘మీ నాన్న జయంతి కార్యక్రమాలకు కరోనా అడ్డు రాలేదా?’’ అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి.
ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి ఆసక్తికర ప్రశ్నను సంధించారు. జెరూసలెంకు ఫ్యామిలీతో కలిసి వెళ్లే సీఎం జగన్.. హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదని సందేహం వ్యక్తం చేశారు. హిందూత్వాన్ని జగన్ గౌరవించడం లేదని.. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు.
పక్క రాష్ట్రంలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని స్వామిజీ ప్రశ్నించారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే భక్తులు తిరగబడతారని హెచ్చరించారు. పనిలో పనిగా జగన్‌ను ఎంతో ఇష్టపడే విశాఖ స్వరూపానంద స్వామీ తీరునూ తప్పుబట్టారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తే జగన్ రాజగురువు శారదా పీఠం స్వామీజీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించడం ఆసక్తికరం.


