ట్రంప్ కాదు.. శ్రీనివాస్ హత్యకి అసలు కారణం ఇదీ!

అమెరికాలో తెలుగు యువకుడి హత్య.... ఈ వార్త మనల్ని కొన్ని రోజులుగా ఎంత కలచి వేసిందో చెప్పక్కర్లేదు. ఒక వైట్ అమెరికన్ ఉన్మాదం, ఆవేశం, అరాచకం ఒక తెలుగు తేజాన్ని ఆర్పేసింది. ఒక కుటుంబం మొత్తాన్నీ ఛిద్రం చేసింది. యావత్ భారతీయుల్ని ఆక్రోశానికి గురి చేసింది. ఎవ్వరూ వేలెత్తి చూపలేని టాలెంట్ తో ఇండియన్స్ అమెరికాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. పూర్తిగా అర్హత మీదే ఆధారపడి అందలాన్ని అందుకుంటున్నారు. అయినా ట్రంప్ ప్రభావంలోని అమెరికాలో అసూయ అక్కడి వారి చేత ట్రిగ్గర్లు నొక్కిం చేస్తోంది. ఎన్నో ఆనందాల్ని అమెరికాలోనూ, ఇండియాలోనూ చిదిమేస్తోంది... 

 

 

శ్రీనివాస్ కూచిభోట్ల అనే మన సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అగ్రరాజ్యంలో అక్కడి ఒక ఉన్మాది ఉగ్రహానికి బలయ్యాడు. కాని, అంతకంటే ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మనకు బోలెడంత విషాదం కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ను తిట్టిపోసి కోపం చల్లార్చుకుంటున్నారు. కాని, నిజంగా తిట్టాల్సింది ట్రంప్ ను మాత్రమేనా? అంతకు మించి విలన్లు ఎవ్వరూ భారతీయుల ఈ దుస్థితికి కారణం కాదా? ఒక్కసారి ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకు దొరికే జవాబులు ట్రంప్ పాత్ర ఎంత చిన్నదో తేల్చేస్తాయి!

 

 

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని ఒక వర్గానికి... విదేశీయులపై , ముఖ్యంగా ఆసియా నుంచి వచ్చి స్థిరపడ్డ వలస ఉద్యోగులపై ద్వేషం నూరిపోస్తున్నాడని అందరి కంప్లైంట్. అది నిజమే కావచ్చు. కాని, ట్రంప్ ను సమర్థించే వారి వద్ద వెయ్యి కారణాలున్నాయి. ట్రంప్ చేసేది, చెప్పేది ఎందుకు కరెక్టో బల్లగుద్ది వాదించే వారున్నారు. కాని, అసలు ట్రంప్ వ్యవహార తీరు కాదు. అసలు సమస్య అమెరికన్ కల్చర్. అక్కడి గన్ కల్చర్. అమెరికాలోని చాలా మంది తెల్లవారికి ఇప్పటికీ తాము ఆఫ్రికా, ఆసియా వాసుల కంటే గొప్ప వారమనే అహంకారం వుంటుంది.

 

 

ఈ జాతి వివక్ష ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అందరికీ తెలిసిందే! అందుకే, ట్రంప్ తో ఏ సంబంధం లేని ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం ఎంత మంది భారతీయులు హత్యకి గురయ్యారో గుర్తు చేసుకోండి? జాతి వివక్ష చాలా తెల్ల దేశాల్లో వుంటుంది. అంతే కాదు, దానికి తోడు ఆయా దేశాల్లో గన్ కల్చర్ విచ్చలవిడిగా వుండటంతో క్షణాల్లో ప్రాణాల్ని బలి తీసేసుకుంటారు ఉన్మాదులు. ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటే అతడికి ఓట్లు గెలిపించిన అమెరికన్స్ కంటే ఈ ఉన్మాదులే చాలా డేంజర్. అమెరికాలోని ఒక వర్గం వలస వచ్చిన వారు తమ అవకాశాలు తన్నుకుపోతున్నారని భావించటం కేవలం రాజకీయ కోణమే. అందులో హింస లేదు. హింస వున్నదంతా వైట్ అమెరికన్స్ అహంకారంలో. వారి చేతుల్లో గన్స్ లో!

 

 

శ్రీనివాస్ కూచిభోట్ల మర్డర్ మరో సత్యాన్ని కూడా మన ముందుంచుతుంది. అసలు ట్రంప్ వద్దు పొమ్మంటే కూడా మన ఇండియన్స్ ఎందుకు అమెరికాను పట్టుకుని వేలాడుతున్నారు? ఇండియాలో తగిన అవకాశాలు లేక. అమెరికాలో వచ్చేంత ఆదాయం ఇక్కడ రాక. ఉద్యోగాలు కల్పించాల్సిన పాలకులు, పార్టీలు, ప్రభుత్వాలు మాటలు చెప్పటం తప్ప నిజంగా చేసింది ఏమీ లేదు! దేశాన్ని పాలించిన కాంగ్రెస్, రాష్ట్రాల్ని పాలించిన ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు అధికారం చెలాయిస్తోన్న బీజేపి... అందరూ అభివృద్ది చేశామనే అంటారు కాని.. ఏటా అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించుకునే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు! ఇంకా విషాదం ఏంటంటే... అమెరికాకు వెళ్లి యాతన పడుతోన్న చదువుకున్న వారికన్నా దుబాయ్ కి వెళ్లి నరకయాతన అనుభవిస్తోన్న చదువుకోని వారి సంఖ్య మరింత ఎక్కువ! చమురు దేశాల్లో మసిబారిపోయిన భారతీయుల జీవితాలు ఎన్నో! వారి గురించి ఒక అమెరికన్ ఎన్నారై చనిపోతే మాట్లాడినంతగా మీడియా కూడా మాట్లాడదు! 

 

 

చదవుకుంటే అమెరికాకు, చదువు లేకపోతే దుబాయ్ కి వెళ్లాల్సి రావటం నిజంగా భారతీయుల విషాదం. ఆ తరువాతే ట్రంప్ తెంపరితనం అయినా, ఏదైనా. మన మీడియా, మేధావులు అంతా, అందరూ టార్గెట్ చేయాల్సింది మన దేశంలోని వ్యవస్థని. ఇక్కడి పాలకుల్ని. అంతే కాని, ట్రంప్ ని ఉక్రోశంతో తిట్టిపోస్తే ఇప్పుడే కాదు... దీర్ఘకాలంలోనూ ఏ లాభం వుండదు. ఏనాటికైనా భారత్ శ్రీనివాస్ కూచిభోట్ల లాంటి నిపుణుల్ని గడప దాటనీయకుండా చూసుకుంటేనే వ్యవస్థకి, వ్యక్తులకి రెంటికీ లాభం....