లోకేష్ బాబు పద ప్రయోగానికి 'శృంగేరి' జగద్గురు పీఠం మద్దతు....

* తెలిసో, తెలియకో లోకేష్ వాడిన 'వర్ధంతి' పద ప్రయోగం కరెక్టే అని తేల్చిన పంచాంగ కర్తలు 
* నారా లోకేష్ కు కలిసొచ్చిన శార్వరి నామ సంవత్సరం 

నారా లోకేష్ బాబూ.... మీరిక రిలాక్స్ అవ్వొచ్చు. మీ రాజకీయ ప్రత్యర్ధులు తరచూ మీ తెలుగు పద ప్రయోగంపై విరుచుకు పడుతూ, మిమ్మల్ని ఆట పట్టిస్తుంటే, మీకు తీవ్రమైన మనో ఖేదం కలుగుతోంది గదా. ఇప్పుడు మీకింకా బెంగ అక్కర్లేదు. 23 వ పులకేశి లాగా మీరు కూడా మీ ప్రత్యర్థులపై విచ్చలవిడిగా చెలరేగిపోండి. సాక్షాత్తూ ఆదిశంకరుల ప్రధమ పీఠం శృంగేరి జగద్గురు మహాసంస్థానమే మీ పద ప్రయోగానికి -బాసటగా నిలబడింది. తెలిసో, తెలియకో మీరు చేసిన వర్ధంతి ప్రయోగానికి అసలైన అర్ధాన్ని -శ్రీ శృంగేరి జగద్గురు సంస్థానం వారి ఈ ఏడాది పంచాంగం లో పంచాంగ కర్తలు సమగ్రంగా వివరించారు. 

వర్ధంతి అనే శబ్దం 'వృధు-వృద్దౌ ' అనే ధాతువు నుంచి వచ్చిందనీ, అది వృద్ధి అనే అర్ధం చెపుతోందనీ శృంగేరి పంచాంగ కర్తలు చెప్పుకొచ్చారు. కాబట్టి వర్ధంతి అనే శబ్దం, పుట్టినరోజు పండుగ అనే అర్ధం లో ప్రయోగించటానికి యోగ్యంగా ఉందని వారు వివరించారు. కానీ, ఆంధ్ర దేశం లో ఆ శబ్దం విపరీతార్థం లో వాడబడుతోందనీ, కానీ అది పూర్తిగా అసంగతమనీ శృంగేరి పంచాంగ కర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు శృంగేరి జగద్గురు మహా సంస్థానం లో జగద్గురువుల జన్మదినోత్సవం, ఇంకా మైసూరు మహారాజ సంస్థానం లో మహారాజ వారి జన్మ దినోత్సవం వందల ఏళ్ల నుంచీ వ్యవహరింపబడుతోందని పంచాంగ కర్తలు సోదాహరణం గా వివరించారు.

 

 

తదనుసారంగా మా పంచాంగం లో జగద్గురువుల జన్మదినోత్సవాన్ని 'వర్ధంతి' అని నిర్దేశిస్తున్నామని, సహృదయులు ఆ పదానికి విపరీతార్ధాన్ని పరిత్యజించి పైన చెప్పిన సరైన అర్ధాన్ని గ్రహించాలని పంచాంగ కర్తలు విజ్ఞప్తి చేశారు. అంచేత, నారా లోకేష్ గారి భాషా ప్రయోగాన్ని ఎత్తిచూపే వారికీ, వెటకరించే వారికీ ఒక హెచ్చరిక. సాక్షాత్తూ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం పంచాంగ కర్తలు 'వర్ధంతి' అనే పద ప్రయోగంపై ఇచ్చిన క్లారిటీ కారణంగా, నారా లోకేష్ గారి పద ప్రయోగంపై మాట్లాడే ముందు, ఒకటికి రెండు సార్లు శృంగేరి పంచాంగం చూసి మరీ మాట్లాడండి. లోకేష్ బాబూ..మీరిక పండగ చేసుకోండి.. మీ 'వర్ధంతి' పద ప్రయోగానికి పంచాంగ కర్తల ఆమోద ముద్ర లభించింది. మొత్తానికి లోకేష్ బాబుకు, శార్వరి నామ సంవత్సరం ఈ రకంగా కలిసొచ్చిందన్న మాట.