TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీలక్ష్మి అవినీతి అందంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

Published on: Sat Feb 4, 2012 1:38PM

హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎంత అందంగా ఉంటారో అంత అవినీతిపరురాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లో శ్రీలక్ష్మి చాలా నిజాయితీగా ఉండేదని, అప్పుడు చూసి ఈ అమ్మాయి కేంద్ర సర్వీసులకు వెళ్తుందని అనుకునేవాడినని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొంత మంది నిజాయితీపరులైన ఐఎఎస్ అధికారుల గురించి కూడా ఆయన చెప్పారు. ఆయన శనివారం విజయవాడలో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు సీబీఐకు వ్యతిరేకంగా పోరాటం చేయడం సరికాదన్నారు. ఐఎఎస్ అధికారులు సిబిఐ విచారణను తప్పు పట్టడం సరి కాదని, అలా తప్పు పడుతున్నారంటే అవినీతి ఐఎఎస్ అధికారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుత హోం మంత్రి, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి ముద్దాయి అని, ఈ కేసులో సబితా ఇంద్రా రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నివేదికలో ఉన్న అధికారులు, లంచావతారుల పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి ఆబ్కారీ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి తాను ఈ నెల 18వ తేదీన నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.