ఆత్మహత్య చేసుకుంటే హోదా కోసమేనా?

 

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ సమీపంలో ఈరోజు తెల్లరుజామున ఓ వ్యక్తి మృతదేహాన్నిఅక్కడి సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతుడిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చక్రాల కుర్చీలో మృతిచెందిన అతడి వద్ద ఒక లేఖ లభ్యమయ్యింది. పక్కనే చిన్న బాటిల్‌, రూ.20నోటును పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీల అమలు,ప్రత్యేక హోదా అంశాలపై కేంద్రం తీరును నిరసిస్తూ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోదా కోసమే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ధర్మ పోరాట వేదిక నుంచి మాట్లాడిన చంద్రబాబు.. ఆత్మహత్య ఘటన పట్ల దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాగా ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో తేలింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మాట్లాడుతూ.. గత రాత్రి ఢిల్లీ ఏపీ భవన్ సమీపంలో 40 ఏళ్ల వయసున్న ఓ మానసిక వికలాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో తేలిందని స్పష్టం చేశారు.