నాగార్జునపై యుద్దానికి సిద్ధమవుతున్న శ్రీకాకుళం రైతాంగం
Published on: Fri May 4, 2012 9:49AM
శ్రీకాకుళం రైతాంగానికి ఉద్యమాలు కొత్తేమీ కాదు. గతంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక సాయుధ పోరాటాలు చేశారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న శ్రీకాకుళం రైతాంగాన్ని నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ రెచ్చగొడుతోంది. ఈ కంపెనీ సోంపేట మండలం రుషికుర్దా సమీపంలో 2,640 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్ నెలకొల్పటానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ థర్మల్ ప్లాంటు ఏర్పాటును స్థానిక రైతాంగం వ్యతిరేకిస్తోంది. చిత్తడినేల బీట ప్రాంతాన్ని చవుడు నేలలుగా రికార్డుల్లో చూపి అక్కడ థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ యాజమాన్యం అనుమతులు పొందిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కంపెనీ ప్రతినిథులు 2010 జులై 14న ఈ ప్రాంతంలో కంచె వేయటానికి ప్రయత్నించగా వందలాది మంది స్థానిక రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విచక్షణారహితంగా కాల్చటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన తరువాత ప్రాజెక్టు అనుమతులన్నీ పెండింగ్ లో పెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. సోంపేటలోని కార్యాలయాన్ని ఎన్.సి.సి. యాజమాన్యం వేరే చోటికి తరలించింది. వివాదం సద్దుమణి గిందని అనుకుంటున్న సమయంలో ఈ ప్లాంటు ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేశామని కేంద్రమంత్రి జయంతి నటరాజన్ కొద్దిరోజుల క్రితం లోక్ సభలో ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ ప్రాణాలు పోయినా సరే తమ భూములను కాపాడుకుంటామని, విద్యుత్తు ప్లాంటు ఏర్పాటును అడ్డుకుని తీరతామని రైతులు హెచ్చరించారు. అణుధార్మిక కాలుష్యం కన్నా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాలుష్యం ఎన్నోరెట్లు ప్రమాదకరమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


