శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక అశాంతి
Published on: Mon Feb 20, 2012 8:57AM
పరిస్థితులను గమనిస్తున్న మావోయిస్టులు?
శ్రీ
కాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పారిశ్రామికవాడ కార్మిక అశాంతితో రగిలిపోతుంది. ఆకలి కేకలతో కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నావారి సమస్యలు పరిష్కరించేవారే కరువయ్యారు. ఇక్కడి రెడ్డీస్ లేబొరేటరీ, ఆంధ్రా ఆర్గానిక్స్, యు.బి. పరిశ్రమల్లో పనిచేస్తున్న వందలాదిమంది కార్మికులు తమ సమస్యల పరిష్కారంకోసం అనేక రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వీరి సమస్యలను పరిశీలించడంలేదు. యాజమాన్యాలు వీరిని పూర్తిగా విస్మరిస్తున్నాయి. మరోవైపు నక్సలైట్లు ఇక్కడి పారిశ్రామిక అశాంతిని నిశితంగా పరిశీలిస్తున్నారు. కార్మికులు కూడా నిరాశతో మావోయిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఆంధ్రా ఆర్గానిక్స్ లో కార్మికులు రెండు నెలలనుంచి ఆందోళన చేస్తున్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన ఏడుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వేతనాలు పెంచాలని కోరుతున్నారు. రెడ్డీస్ లేబొరేటరీలో కార్మికుల ఆందోళన వందరోజులకు చేరుకుంది. ఎజెసి, పోలీస్ అధికారుల సమక్షంలో యాజమాన్యం యూనియన్ నాయకులకు మధ్య కుదిరిన ఒప్పందం నేటికీ అమలు చేయలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కూడా కేవలం రోజుకు 120 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్ఐ కార్మిక చట్టాలను అమలు చేయడంలేదని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యాల మొండి వైఖరి కారణంగా ఇక్కడ కూడా యానాం సంఘటనలు పునరావృతం కావచ్చనే భయాందోళనలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.


