శ్రీదేవి చివరి ఆకాంక్ష...ఆ రంగు పూలతో అంతిమ యాత్ర..!
Published on: Tue Feb 27, 2018 4:33PM

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు పంపించడానికి క్లియరెన్స్ వచ్చింది. శ్రీదేవి మృతిపై ఫొరెన్సిక్ నివేదికతో ఏకీభవించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో దుబాయ్ నుండి బయలుదేరిన మృతదేహం.. రాత్రి 10 గంటలకు ముంబై చేరుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి నివాసం వద్ద అభిమానులు నిరీక్షిస్తున్నారు. అంతేకాదు అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం పదకొండు గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచుతారు. ఈ క్రమంలో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట. తన అంతిమ యాత్రకు సంబంధించిందంతా తెలుపు రంగులో ఉండాలన్నదే శ్రీదేవి ఆకాంక్ష అనే వార్త ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. అందుకే ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు.. తెలుపు రంగువే వినియోగించనున్నట్టు తెలుస్తోంది.


