శ్రీ చైతన్యకు మీడియా'పోటు'
Published on: Thu Apr 12, 2012 12:05PM
శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రెస్ అండ్ మీడియా వర్గాలనుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణం ఆ విద్యాసంస్థలు విడుదల చేస్తున్న, విడుదల చేయబోయే వ్యాపార ప్రకటనలే. శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రతి విద్యాసంవత్సరం ముందు సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల విలువైన వ్యాపార ప్రకటనలు ఇస్తున్నాయి.
ఈ ప్రకటనల్లో ఎక్కువభాగం దక్కించుకునేందుకు కొన్ని పత్రికలూ, ఎలక్ట్రానిక్ ఛానల్స్ పోటీపడుతున్నాయి. ఈ విద్యాసంస్థల అధినేతలపై తీవ్రస్థాయిలో వత్తిడి తెస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈనాడు పత్రికకు సుమారు ఐదు కోట్ల రూపాయలు, సాక్షిపత్రికకు దాదాపు 4.8 కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ను ప్రత్యేకసంచికల రూపంలో ఈ విద్యాసంస్థలు ఇచ్చాయి. దీంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్వయంగా రంగంలోకి దిగి కనీసం సాక్షిపత్రికతో సమానంగానైనా తమకు యాడ్స్ ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే ఆంధ్రజ్యోతికి ఎబిసి సర్టిఫికేట్ లేదనే సాకుతో శ్రీచైతన్య యాజమాన్యం తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కాని ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నించి సుమారు 4 కోట్ల రూపాయల యాడ్స్ సంపాదించినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు రంగంలోకి దిగారు. ప్రతి విద్యాసంవత్సరంలోనోలో శ్రీచైతన్య సంస్థలు ఈటివి-2, టీవి-9 ఛానల్స్ కు పెద్దమొత్తంలో యాడ్స్ ఇస్తున్నాయి టీవి-5, ఎన్ టి.వి. లాంటి ఛానల్స్ కు తక్కువ మొత్తంలో యాడ్స్ ఇస్తూ మిగిలిన చానళ్ళను విస్మరిస్తున్నాయి.


