శ్రీశాంత్‌కు గుడ్ న్యూస్.. బ్యాక్ టు గ్రౌండ్!!

 

టీమిండియా క్రికెటర్‌ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్న శ్రీశాంత్‌ కల నెరవేరింది. అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్‌కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. ప్రస్తుతం అతడికి 36 ఏళ్లు. కేరళ తరపున, విదేశీ లీగుల్లో ఆడాలని అతడు కోరుకుంటున్నాడు.

కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్న సమయంలో శ్రీశాంత్‌ నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న అతడిపై 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. తనపై అన్యాయంగా ఫిక్సింగ్‌ ఆరోపణలు మోపి ఇరికించారని శ్రీశాంత్‌ అప్పటినుంచి పోరాడుతూనే ఉన్నాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టు అతడికి శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ను ఆదేశించింది. తాజాగా అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ తీర్పు వెల్లడించారు. ‘నిషేధ కాలంలో శ్రీశాంత్‌ ఎటువంటి క్రికెట్‌ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాంతో పాటు బీసీసీఐ యాక్టివిటీలకు కూడా దూరంగా ఉన్నాడు. దాంతో అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశాం. ఇది 2013 సెప్టెంబర్ట్‌ 13వ తేదీ నుంచి వర్తిస్తుంది’ అని డీకే జైన్‌ తెలిపారు.