శ్రీశాంత్ కు ఇంకా కోపం పోలేదా...?


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్ శ్రీశాంత్ పై బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తనపై బీసీసీఐ జీవితకాలం నిషేదం విధించింది. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయంతో బీసీసీఐ ఆ నిషేదాన్ని ఎత్తేసింది. అయితే ఇప్పుడు శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తనపై ఆరోపణలు మోపిన బీసీసీఐపై, బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంపై కోపంతో రగిలిపోతున్న శ్రీశాంత్.. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగంగానే చెబుతున్నాడు.

 

దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్..‘నాపై బీసీసీఐ నిషేధం విధించింది. ఐసీసీ కాదు. నేను వేరే ఏ దేశం తరఫునైనా ఆడొచ్చు. ప్రస్తుతం నా వయసు 34 ఏళ్లు. ఇంకో ఆరేళ్లపాటు ఆడగల సామర్థ్యం నాకు ఉంది. క్రికెట్‌ను ప్రేమించే ఒక వ్యక్తిగా, నేనింకా ఆడాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. మనది భారత జట్టు అని చెప్పుకున్నా.. బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని మీకు తెలుసు. కాబట్టి నేను వేరే దేశం తరఫున ఆడినా, బీసీసీఐ లాంటి ప్రైవేటు సంస్థకి ఆడినట్టే. అయితే కేరళ తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొనడం అనేది దీనికి విరుద్ధం. కేరళ తరఫున రంజీ ట్రోఫీ, ఇరానీ గెలవాలని కలలు కన్నాను. కానీ నా ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి శ్రీశాంత్.. తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా... తనపై ఆరోపణలు మోపినందుకుగాను బీసీసీఐ పై ఇంకా కోపంగా ఉన్నట్టే తెలుస్తోంది.