TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ డీఎస్సీ యాజిటేషన్ బూమరాంగ్.. జగన్ డిఫెన్స్ లో పడ్డారా?

Published on: Mon Sep 21, 2026 2:42PM

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ  నియామకాల ప్రక్రియపై వైసీపీ విమర్శలు, ఆందోళనలు, ఆరోపణలూ బూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది.ముఖ్యంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ ఆరోపణలు, విమర్శలు.. ఆ పార్టీ అధినేత జగన్ కు దిమ్మదిరిగే దెబ్బ కొడుతున్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు.  డీఎస్సీ ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నేరుగా రంగంలోకి దిగి జగన్ వ్యాఖ్యలను, విమర్శలను, ఆరోపణలను ఖండిస్తున్న తీరు ఆయనను, ఆయన పార్టీనీ డిఫెన్స్ లో పడేస్తున్నాయి. తమ నియామకాలలో   అక్రమాలు జరగలేదని, అన్ని అర్హతలు, సరైన ధ్రువపత్రాలు ఉన్న తర్వాతే తమకు నియామకాలు దక్కాయని వారు కుండబద్దలు కొడుతున్నారు.  రాజకీయ లబ్ధి కోసం   మంది నిరుద్యోగుల భవితవ్యంతో ముడిపడిన ఉపాధ్యాయ నియామకాలను వివాదాస్పదం చేయడం తగదంటూ బాధితులు, ఉద్యోగులు జగన్ కు, వైసీపీకీ గట్టి రాటార్డ్ ఇస్తున్నారు. 

 డీఎస్సీ పరీక్షల నిర్వహణ,  నియామకాలపై వైసీపీ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టేందుకు వైసీపీ నియామకాలలో అక్రమాలు, అవినీతి, అవకతవకలు అంటూ ఆరోపణల మార్గాన్ని ఎంచుకుంది.  ముఖ్యంగా స్పోర్ట్స్  కోటా ఉద్యోగాల భర్తీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి సొమ్ములు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ.. వైసీపీ అధినేత స్వయంగా పలు సందర్భాలలో ఆరోపణలు గుప్పించారు.   అయితే ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్లు కొట్టేసింది. అయినా కూడా వైసీపీ క్షేత్రస్థాయిలో ఈ విషయంలో ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. 

దీంతో వైసీపీ ఆరోపణలపై క్రీడా కోటా కింద ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులు  సీరియస్ గా స్పందించారు. విజయవాడలో దాదాపు 370 మంది క్రీడా కోటా డీఎస్సీ అభ్యర్థులు  రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, తమపై వస్తున్న నిరాధార ఆరోపణలపై  చర్చించారు. తమకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవని, నిబంధనల ప్రకారమే మెరిట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరమే  పోస్టులు దక్కాయని  కుండబద్దలు కొట్టారు. 

ఈ సందర్భంగా వారు.. తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.  నిబంధనల ప్రకారం అర్హత ఉంటే  ఒకే కుటుంబం నుంచి రెండు కాదు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా సాధించవచ్చని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమ నిజాయితీని శంకించడం సరికాదని హితవు చెప్పారు.  

డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఈ సందర్భంగా వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం ఆపకుంటే.. చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  న్యాయపోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు.  వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న   డీఎస్సీ డ్రైవ్‌ను  రాజకీయ స్వార్థం కోసం అప్రతిష్టపాలు చేయడం తగదన్నారు 

దీంతో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారం, సాగిస్తున్న ఆందోళన బూమరాంగ్ అయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో నేరుగా ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకోవడంతో ఆ ఉద్యోగులే తిరగబడి వైసీపీ విమర్శలు, ఆరోపణలను తిప్పి కొడుతునన పరిస్థితి వైసీపీయులను అంతర్మథనంలో పడేసిందంటున్నారు.  మొత్తం మీద  డీఎస్సీ  స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల  తిరుగుబాటు జగన్‌ కు నిస్సందేహంగా పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 

[Sports Quota DSC, Jagan Mohan Reddy, Y CP, AP High Court, Vijayawada Roundtable Meeting, DSC Recruitment Controversies, Jagan Defence, Bumarang, Telugu One]