విజయవాడ నుంచి స్పైస్ జెట్ విమాన సర్వీసులు బంద్..
Published on: Fri Aug 20, 2021 1:08PM
విజయవాడ ప్రజలకు ఇదో బ్యాడ్ న్యూస్. గన్నవరం విమానాశ్రం నుంచి స్పైస్ జెట్ సంస్థ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. ప్రయాణికులు తగ్గడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా 30 శాతం బుకింగ్ లు కూడా జరగడం లేదట. దీంతో ప్రయాణికులు లేని కారణంగా నష్టాలతో విమాన సర్వీసులను నడపలేమని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. అందుకే గన్నవరం విమానాశ్రం నుంచి సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రెండు నెలల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు చెప్పింది.
విమాన సర్వీసులను రద్దు చేసిన స్పైస్ జెట్ సంస్థ.. ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆపేసింది. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే స్పైస్ జెట్ విమాన సర్వీసులు నడిచేవి. రెండేళ్ల క్రితం వరకు స్పైస్ జెట్ విమానాల్లో 80 శాతానికి పైగా బుకింగులు ఉండేవి. ప్రస్తుతం అవి 30 శాతానికి పడిపోయాయి. విమానాశ్రయంలో రన్ వేను పెంచినప్పటికీ సర్వీసులు తగ్గిపోయాయి. స్పైస్ జెట్ సంస్థ విమాన సర్వీసులు రద్దు కావడంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ ఖాళీ అయింది.


